Maha Shivaratri 2022 : తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.

kapila theertham
Maha Shivaratri 2022 : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువపందిళ్లు, పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఏకాంతంగా భోగితేరు ఆస్థానం : బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం భోగితేరు ఆస్థానం జరిగింది. కోవిడ్ -19 నేపథ్యంలో ఈ కార్యక్రమం ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.
స్నపనతిరుమంజనం : ఆ తరువాత అర్చకులు స్నపన తిరుమంజనం ఏకాంతంగా నిర్వహించారు. శ్రీసోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. స్వామి, అమ్మవార్లకు ఉపచారాలు నిర్వహించారు.
ఈ రోజు రాత్రి 7 గంటలకు ఏకాంతంగా నంది వాహనం ఆస్థానం నిర్వహిస్తారు. ఈ రోజు అర్ధరాత్రి (మార్చి 2వ తేదీ బుధవారం తెల్లవారుజామున) 12 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాలంలో స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు.
ఆలయానికి విచ్చేసిన భక్తులకు శ్రీవారి సేవకులు విశేష సేవలందించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణతో పాటు భక్తులు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా సూచనలు చేశారు. భక్తులందరికీ శానిటైజర్ స్ప్రే చేశారు.
మార్చి 2న శివపార్వతుల కల్యాణం : శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి మరుసటి రోజైన బుధవారం సాయంత్రం శివపార్వతుల కల్యాణ మహోత్సవం ఏకాంతంగా జరుగనుంది.
Also Read : Gold And Diamonds : అనధికారికంగా తరలిస్తున్న బంగారం, వజ్రాలు పట్టివేత
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఎఈఓ శ్రీ సత్రేనాయక్, సూపరింటెండెంట్ శ్రీ భూపతి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ రెడ్డిశేఖర్, శ్రీ శ్రీనివాస్‌నాయక్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.