Mahashivratri 2022 : మహాశివరాత్రి రోజు శివుడ్ని అభిషేకించి ప్రసన్నం చేసుకోండి

ఈ ఏడాది మార్చి 1వ తేదీన భక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. చాంద్రమానం లెక్కింపు ప్రకారం మాఘమాస కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి వస్తుంది.

Mahashivratri 2022 : మహాశివరాత్రి రోజు శివుడ్ని అభిషేకించి ప్రసన్నం చేసుకోండి

Maha Shivaratri 2022

Mahashivratri 2022 : ఈ ఏడాది మార్చి 1వ తేదీన భక్తులు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. చాంద్రమానం లెక్కింపు ప్రకారం మాఘమాస కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతి ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు జరుపుకుంటారు. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది.

చాంద్రమానం ప్రకారం, మహాశివరాత్రి   గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. 2022 వ సంవత్సరంలో మార్చి 1 వ తేదీ మంగళవారం మహాశివరాత్రి పర్వదినం వచ్చింది. సంవత్సరంలో వచ్చే పన్నెండు మాస శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా హిందువులు భావిస్తారు.

శివో అభిషేక ప్రియ: అంటే “శివుడు అభిషేక ప్రియుడు” కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను  పరమ శివుడు ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. పలు దేశాల్లో మహాశివరాత్రిని భక్తులు జరుపుకుంటూ ఉంటారు.

నేపాల్ లో మహాశివరాత్రి
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లక్షలాది మంది హిందూ భక్తులు నేపాల్ లోని ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయం వద్ద మహాశివరాత్రికి హాజరు అవుతారు. ట్రినిడాడ్, టొబాగోలో,దేశవ్యాప్తంగా వేలాది హిందువులు 400 పైగా ఆలయాల్లో పవిత్రమైన మహాశివరాత్రి రోజు రాత్రి శివుడికి ప్రత్యేక అభిషేకాలు అందించటం ద్వారా గడుపుతారు. మహాశివరాత్రి రోజు పశుపతినాథ్ దేవాలయంలో భక్తులు  నేతి దీపాలు  వెలిగిస్తారు. ఆ  దృశ్యం  కన్నులపండుగగా ఉంటుంది.  భక్తులు శివరాత్రి రోజు బాగమతి నదిలో స్నానము చేసి, శివరాత్రి పండుగ జరుపుకొంటారు.

బంగ్లాదేశ్ మహాశివరాత్రి 
బంగ్లాదేశ్ లోని   హిందువులు కూడా మహా శివరాత్రి జరుపుకుంటారు. వారు చంద్రనాధ్ ధామ్ (చిట్టగాంగ్) వెళ్తారు. బంగ్లాదేశ్ లోని అందరు హిందువులు మహా శివరాత్రి రోజు చాలా ప్రముఖంగా జరుపుకుంటారు.

భారతదేశంలో మహాశివరాత్రి
భారతదేశంలోని హిందువులు  మహా శివరాత్రిని అతి పవిత్రంగా జరుపుకుంటారు. నదులు, సముద్రాలలో స్నానమాచారించి సమీపంలోని శివాలయాలలో స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాశి, ఉజ్జయినీలోని మహాకాళేశ్వర్ దేవాలయంతో సహా పలు దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలలో శివ భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తారు.

“నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు”

తాత్పర్యము:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేనువు’ కాడి పశువుగా పడి వుంటుందట, ‘కల్పవృక్షం’ అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట !!

శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !! సకలైశ్వర్యములు సమకూరతాయి !!  నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడని. మన అభీష్టాలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. కనుక భక్తులు మహాశివరాత్రి  రోజు తమ శక్తి కొలది స్వామిని అభిషేకించి స్వామి వారిఅనుగ్రహానికి పాత్రులు కాగలరు.