Minister KTR: నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Minister KTR: నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..

Ktr

Minister KTR: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం ఉదయం 9గంటలకు కేటీఆర్ ఖమ్మం చేరుకొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమాలపై మంత్రి ప్రసంగిస్తారు. సభకు భారీగా ప్రజలు తరలివచ్చేలా ఇప్పటికే అధికార యంత్రాంగం, తెరాస నేతలు ఏర్పాట్లు చేశారు.

Minister KTR : రాహుల్, బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

పర్యటన ఇలా..
ఉదయం 8గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రి కేటీఆర్ బయలుదేరుతారు. 9గంటలకు మమత జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగుతారు. 9.15గంటలకు లకారం చెరువుపై రూ.8కోట్ల వ్యయంతో నిర్మించిన కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జ్, మ్యూజికల్ ఫౌంటేన్, ఎల్ఈడీ లైటింగ్ ను ప్రారంభిస్తారు. 9.45గంటలకు రఘునాథపాలెంలో రూ.2కోట్ల వ్యయంతో నిర్మించిన సుడా పార్క్, బృహత్ పల్లె ప్రకృతి వనం ప్రారంభిస్తారు. ఉదయం 10.15గంటలకు టేకులపల్లిలో 240 డబుల్ బెడ్ రూం ఇండ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణం, పట్టణ ప్రగతి వనాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి కేటీఆర్ ప్రారంభిస్తారు. ఉదయం 10.45గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రసంగిస్తారు. మధ్యాహ్నం పాత మున్సిపల్ కార్యాలయంలో సిటీ లైబ్రరీ, ఐటీ హబ్ సర్కిల్ నుంచి జడ్పీ సెంటర్ వరకు నిర్మించిన ఫుట్ పాత్, దానవాయిగూడెంలో ఎఫ్ఎస్టీపీ, ప్రకాశ్ నగర్లోని వైకుంఠధామాన్ని ప్రారంభిస్తారు. రెండు గంటలకు శ్రీనివాస్ నగరంలో మానవ వ్యర్థ పదార్థాలను శుద్ధిచేసే కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ధంసలాపురం వద్ద ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన నర్సరీని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు.

Minister KTR: మోదీ జీ.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? ఎన్జీవోనా..?

మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు మాజీ ఎంపీ, తెరాస నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం భోజనం చేస్తారని సమాచారం. గత కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని పొంగులేటి వర్గీయులు భావిస్తున్నారు. ఇటీవల రాజ్యసభ సీటును పొంగులేటికి కేటాయిస్తారని అందరూ భావించినప్పటికీ చివరి నిమిషంలో ఖమ్మం జిల్లాకు చెందిన మరో నేతకు కేటాయించారు. దీంతో పొంగులేటి వర్గీయులు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పొంగులేటి నివాసంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావుతో పాటు ఆ పార్టీ జిల్లా ముఖ్య నేతలు లంచ్ కు హాజరుకానున్నారు.