Pawan Kalyan : కిన్నెర కళాకారుడు మొగులయ్యకు పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం

భీమ్లా నాయక్ ను పరిచయం చేసే గీతానికి సాకి ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన శ్రీ దర్శనం మొగులయ్యకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

Pawan Kalyan : కిన్నెర కళాకారుడు మొగులయ్యకు పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం

Pawan

Kinnera artist Mogulayya : ‘భీమ్లా నాయక్’ మూవీ టైటిల్ సాంగ్‌ కు సాకి పాడిన కిన్నెర కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం ప్రకటించారు. భీమ్లా నాయక్ ను పరిచయం చేసే గీతానికి సాకి ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన శ్రీ దర్శనం మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు. ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యుమన్ ఎక్సిలెన్స్’ ద్వారా రూ.2లక్షలు అందించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు కార్యాలయ సిబ్బందికి తగిన సూచనలు చేశారు.

త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును మొగులయ్యకు అందజేస్తారని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ తెలిపారు. తెలంగాణలోని అమ్రాబాద్ రిజ్వర్ ఫారెస్టు ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు అని కొనియాడారు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో ఉందన్నారు. మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారని తెలిపారు.

‘భీం భీం భీం భీం భీమ్లా నాయక్’ సాంగ్.. మీడియా, సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ సినిమా ఫస్ట్ సాంగ్‌ రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. ‘భీమ్లా నాయక్’ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాల నలుగురూ కలిసి ఈ పాట పాడారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ పాట మొదట్లో సాకి పాడిన వ్యక్తి ఎవరబ్బా.. ఇంతకుముందు ఏవైనా సినిమాల్లో పాడారా అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్‌తో పాటు సాకి పాడిన వ్యక్తి గురించిన వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి.

మొగులయ్య.. ప్రముఖ తెలంగాణ జానపద గాయకుడు, 12 మెట్లు కిన్నెర వాద్య కళాకారుడు.. ఉమ్మడి పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం లింగాల గ్రామం దర్శనం మొగులయ్య స్వస్థలం. ఆయన తండ్రి ఏడు మెట్ల కిన్నెరను వాయించేవారు. తండ్రి దగ్గరే ఆ కళను నేర్చుకున్న మొగులయ్య.. తన మేధాశక్తితో 7 మెట్ల కిన్నెర స్థానంలో ఆనపకాయ బుర్రలను వెదురుబొంగుకి బిగించి 12 మెట్ల కిన్నెరను తయారు చేశారు. మొగులయ్య తన కళను కేవలం వీరగాథలకు మాత్రమే అంకితమిచ్చారు. పాలమూరు జిల్లాలో ‘పండుగ సాయన్న’, ‘మియాసాబ్’, ‘శంకరమ్మ’, ‘వనపర్తి రాజుల కథలు’ అద్భుతంగా చెప్పేవారు. సమాజాన్ని చైతన్య పరిచేలా మొగలయ్య కథలు చెప్తుంటే వినే వారికి రోమాలు నిక్కబొడుచుకునేవి. ఇటువంటి వీర గాథల ద్వారా ‘పండుగ సాయన్న’ గా పేరు పొందారు.

మొగులయ్య వీర గాథలు చెప్పగా విన్న వారు ఇచ్చే కానుకలతోనే ఆయన జీవనం సాగేది. అయితే కొద్ది సంవత్సరాల క్రితం మొగులయ్య కళను ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఒక పీహెచ్‌డీ స్కాలర్ వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటినుంచి తన కళను పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు పొందారు మొగులయ్య. తెలంగాణ ప్రభుత్వం పలు రకాలుగా ఆదుకోవడమే కాక నెలకు రూ. 10 వేలు చొప్పున పెన్షన్ కూడా మంజూరు చేసింది.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ కావడంతో తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెలంగాణ నేపథ్యాన్ని ఎంచుకున్నారు. ముందు నుంచి తన సినిమాల్లో జానపద గేయాలను సందర్భానికి అనుగుణంగా వాడే పవన్ కళ్యాణ్‌ను ‘భీమ్లా నాయక్’ గా ఎలివేట్ చేసే పాటలో అలాంటి పదాలు ఉంటే బాగుంటుందనుకుని, మూవీ టీం.. మొగులయ్య గురించి తెలుసుకుని ఆయన పాడిన ఓ పాటని ఆధారంగా చేసుకుని.. ఆ పదాలను వాడుతూ సాకిలో రామజోగయ్య శాస్త్రి మార్పులు చెయ్యగా మొగులయ్య అద్భుతంగా పాడారు. ఈ పాటతో ఆయనకు మరింత గుర్తింపుతో పాటు మరిన్ని అవకాశాలు కూడా వస్తాయి.