చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసులు కక్ష సాధింపు చర్యల్లో భాగమే..

చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసులు కక్ష సాధింపు చర్యల్లో భాగమే..

Sc And St Cases Against Chandrababu Are Part Of Partisan Activities1

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు అందేజేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి చేరుకుని సీఐడీ అధికారులు నోటీసులు అందజేయగా.. రాజధాని భూముల అక్రమాలపై నోటీసులు అందించారు. 23వ తేదీ విచారణకు హాజరుకావాల్సిందిగా ఏపీ సీఐడీ నోటీసులు ఇవ్వగా.. అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చెయ్యడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు ఇచ్చారని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములను రైతుల ఆమోదంతో తీసుకుని రాజధాని కోసమే ఉపయోగించామని, దేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఎప్పుడైనా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారా? అని ప్రశ్నించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా? ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఏ విధంగా కేసు పెడతారు? అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారు అని మండిపడ్డారు.

రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చాము. ల్యాండ్ పూలింగ్ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపు కాదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి నేటికీ సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములు వాడుకుంటున్నారు. అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న చరిత్ర జగన్ రెడ్డిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పేరుతో వందలాది మంది అసైన్డ్ భూములను లాక్కున్నారని అన్నారు.

దశాబ్ధాల నుంచి ఇడుపులపాయలో అసైన్డ్ భూములు వాడుకుంటన్న చరిత్ర జగన్‌ది. వాన్ పిక్ భూములు లాక్కుని రైతులకు పరిహారం నేటికీ ఇవ్వలేదని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, రాజధాని నిర్మాణం కోసం ల్యాండ్ పూలింగ్‌ను చేపట్టినట్లు చెప్పుకొచ్చారు. ఎక్కడా సొంత ప్రయోజనాల కోసం భూములను తీసుకోలేదు. రైతుల అనుమతితోనే ఆ భూమలు సేకరికంచడం జరిగిందని అన్నారు.