Lakhimpur Kheri Violence : లఖింపూర్ ఘటనపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన కాంగ్రెస్

దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఘటనపై 'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు ఓ వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

Lakhimpur Kheri Violence : లఖింపూర్ ఘటనపై రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరిన కాంగ్రెస్

Congress (6)

Lakhimpur Kheri Violence  దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖింపూర్ ఘటనపై ‘మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్’ పేరిట రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​కు ఓ వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఆదివారం రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరింది. రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ,ఏకే అంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌధురి కాంగ్రెస్ బృందంలో ఉంటారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో జరిగిన ఘటన దేశ ప్రజలను కదిలించింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రైతులను బహిరంగంగా బెదిరించారు. మంత్రి కుమారుడే తమపైకి వాహనం నడిపాపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ విషయమై పూర్తి సమాచారాన్ని ఇచ్చేందుకు అనుమతివ్వాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో కాంగ్రెస్ కోరింది. ఇక,ఈ నెల 6న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు లఖీంపూర్ ఖేరీలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే.

కాగా, గత ఆదివారం లఖీంపూర్ ఖేరీ వద్ద రైతుల నిరసన సమయంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనకు సంబంధించి కేంద్ర  హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను శనివారం  రాత్రి యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆశిష్ మిశ్రాను 14రోజుల జ్యూడిషీయల్ కస్టడీకి  పంపారు. ఈ ఘటనకు సంబంధించి ఆశిష్ మిశ్రా కుటుంబానికి అనుచరులుగా పేర్కొంటున్న ఇద్దరు బీజేపీ కార్యకర్తలు లువ్, ఆశిష్ పాండేలను ఇప్పటికే యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.

మరోవైపు,లఖింపుర్ ఖేరి ఘటనను “హిందూ-సిక్కుల మధ్య యుద్ధం”గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కథనాలపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ స్పందించారు. ఈ తరహా తప్పులను ప్రోత్సహించడం మంచిదికాదని హెచ్చరించారు. దీనిని మానిపోయిన గాయాలను తిరిగి రేపడంగా అభివర్ణించారు. నిరసన తెలుపుతున్న రైతులకు ‘ఖలిస్థానీ’ అనే పదాన్ని ముడిపెట్టడం మంచిది కాదని, ఇది జాతి ఐక్యతకు అత్యంత ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. లఖింపూర్ ఖేరి ఘటనను ఊచకోతకు గురైన పేద రైతులకు-అహంకారం కలిగిన శక్తిమంతమైన వ్యక్తులకు మధ్య జరుగుతున్న న్యాయపోరాటంగానే చూడాలని… దీనిలో మతపరమైన కోణమేమీ లేదన్నారు.

ALSO READ  టీకా వితరణలో భారత్ సరికొత్త రికార్డు.. 95 కోట్లమందికి టీకా పూర్తి