Karnataka: ఆ 5 హామీల అమలుకు సిద్ధరామయ్య కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఏమిటా హామీలు? ఎన్ని కోట్లాది రూపాయలు ఖర్చవుతాయో తెలుసా?

మేనిఫెస్టోలో 5 హామీలు ఇచ్చామని, మొదటి కేబినెట్ సమావేశంలోనే వాటి అమలుపై చర్చించి, ఆదేశాలు ఇచ్చామని సిద్ధరామయ్య చెప్పారు.

Karnataka: ఆ 5 హామీల అమలుకు సిద్ధరామయ్య కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. ఏమిటా హామీలు? ఎన్ని కోట్లాది రూపాయలు ఖర్చవుతాయో తెలుసా?

Siddaramaiah

Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సిద్ధరామయ్య అనంతరం విధాన సౌధాకు వెళ్లారు. తొలి కేబినెట్ (Karnataka Cabinet) సమావేశం నిర్వహించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం సిద్ధరామయ్య మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు తెలిపారు. కాంగ్రెస్ (Congress) ప్రకటించిన 5 పథకాల అమలుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

గత బీజేపీ ప్రభుత్వం పనికిరాని సర్కారు అంటూ విమర్శలు గుప్పించారు. పన్నుల రూపంలో రాష్ట్రానికి వచ్చే షేర్ ను సరిగ్గా తీసుకోలేకపోయిందన్నారు. ఆర్థిక సంఘ ప్రతిపాదనల ప్రకారం కర్ణాటకకు కేంద్ర సర్కారు రూ.5,495 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, వాటిని రాష్ట్రంలోని గత బీజేపీ ప్రభుత్వం తీసుకోలేకపోయిందని చెప్పారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆమెతో పాటు ప్రధాని మోదీ కారణంగా కర్ణాటక నష్టపోయిందని ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలను మే 22 నుంచి మూడు రోజులు నిర్వహిస్తామని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని, ఈ నేపథ్యంలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండేను ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించాలని కోరామని చెప్పారు. కొత్త స్పీకర్ ను కూడా ఎన్నుకుంటామని అన్నారు.

మేనిఫెస్టోలో 5 హామీలు ఇచ్చామని, మొదటి కేబినెట్ సమావేశంలోనే వాటి అమలుపై చర్చించి, ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. వారం రోజుల్లో మరో కేబినెట్ సమావేశం నిర్వహించి వాటికి ఆమోదం తెలుపుతామని అన్నారు.

కాంగ్రెస్ ప్రకటించిన 5 పథకాలు

1. గృహ జ్యోతి: కర్ణాటకలోని ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్
2. గృహ లక్ష్మి: కుటుంబ పెద్దగా ఉన్న ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,000
3. అన్న భాగ్య: దారిద్య్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి ప్రతి నెల 10 కిలోల బియ్యం
4. యువ నిధి: నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ప్రతి నెల రూ.3,000 భృతి, డిప్లొమా ఉండి ఉద్యోగం లేని వారికి ప్రతి నెల రూ.1,500. ఈ నిరుద్యోగ భృతిని రెండు సంవత్సరాల పాటు 18-25 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న వారికి అందిస్తారు.
5. శక్తి: కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో ఆర్డినరీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయొచ్చు

ఎంత ఖర్చు?
ఈ పై పథకాలను అమలు చేసేందుకు ఏడాదికి దాదాపు రూ.50,000 కోట్లు ఖర్చు అవుతాయని సిద్ధరామయ్య అన్నారు. తన తొమ్మిది మంది కేబినెట్ సభ్యులతో కలిసి ఇవాళ జరిపిన సమావేశంలో ఈ విషయాన్ని చెప్పారు.

Karnataka: సీఎం ప్రమాణ స్వీకారోత్సవం.. దేశంలోని విపక్షాల ఐక్యతను, బలాన్ని ప్రదర్శించారా? విఫలమయ్యారా?