Karnataka: సీఎం ప్రమాణ స్వీకారోత్సవం.. దేశంలోని విపక్షాల ఐక్యతను, బలాన్ని ప్రదర్శించారా? విఫలమయ్యారా?

2019 లోక్ సభ ఎన్నికల ముందు 2018లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో 2024 లోక్ సభ ఎన్నికల ముందు 2023లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో....

Karnataka: సీఎం ప్రమాణ స్వీకారోత్సవం.. దేశంలోని విపక్షాల ఐక్యతను, బలాన్ని ప్రదర్శించారా? విఫలమయ్యారా?

Karnataka CM swearing in ceremony

Congress: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పార్టీ దేశంలోని పలు పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో కంఠీరవ స్టేడియం (Sree Kanteerava Outdoor Stadium) వేదికపై నుంచి దేశంలోని విపక్షాల ఐక్యతను, బలాన్ని ప్రదర్శిస్తారని ప్రచారం జరిగింది.

ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ (DK Shivakumar), ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగిన కంఠీరవ స్టేడియంలో విపక్షాల ఐక్యత విషయంలో ఊహించినంత సీన్ కనపడకపోయినప్పటికీ, దేశంలోని ప్రధాన పార్టీలకు చెందిన చాలా మంది నేతలు హాజరయ్యారు.

వీరు కనపడలేదు..
యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ ఈ కార్యక్రమానికి రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందకపోవడంతో వెళ్లలేదని తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆ కార్యక్రమంలో కనపడలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హాజరుకాలేదు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కార్యక్రమంలో కనపడలేదు. ఇక దేశ రాజకీయాల్లో కీలకమైన యూపీ నేతలూ రాలేదు. అంతేగాక, కాంగ్రెస్ పై ఇవాళే బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు చేశారు.

వీరు హాజరు..
సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నేతల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఉన్నారు.

అలాగే, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు (ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్) భూపేశ్ బఘేల్, అశోక్ గహ్లోత్, సుఖ్వీందర్ సింగ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా హాజరయ్యారు. వీరితో పాటు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్, సినీనటుడు కమల్ హాసన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా కూడా హాజరయ్యారు.

2018లో ప్రమాణ స్వీకారానికి..

కర్ణాటక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన అనంతరం జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి సీఎంగా విధానసౌధ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు.

ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరై విపక్షాల ఐక్యతను, బలాన్ని చాటారు.

ఈ సారి కూడా ప్రతిపక్షాల ఐక్యత, బలాన్ని చాటాలని కాంగ్రెస్ భావించింది. కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న పార్టీలను దేశానికి చూపాలని, తమ బలం ఎంతో చాటుకోవాలని భావించింది. 2019 లోక్ సభ ఎన్నికల ముందు 2018లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో 2024 లోక్ సభ ఎన్నికల ముందు 2023లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల కూటమికి ప్రాధాన్యం పెరిగింది.

karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం