Supreme Court : ఇళ్లను కూల్చేసి రాత్రికి రాత్రే వేలాదిమందిని వెళ్లగొడతారా? అంటూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

ఇళ్లను కూల్చేసి రాత్రికి రాత్రే వేలాదిమందిని వెళ్లగొడతారా? పేదల ఇళ్లను ఖాళీ చేయించటానికి పారామిలటరీ బలగాలా? అంటూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.

Supreme Court : ఇళ్లను కూల్చేసి రాత్రికి రాత్రే వేలాదిమందిని వెళ్లగొడతారా? అంటూ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Supreme Court stays Uttarakhand HC order

High court-Supreme Court : ఇళ్లను కూల్చేసి రాత్రికి రాత్రే వేలాదిమందిని వెళ్లగొడతారా? అంటూ ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 50 నుంచి 70 ఏళ్లుగా నివసిస్తున్నవారిని రాత్రికి రాత్రే వారి ఇళ్లు కూల్చివేసి 50 వేల మందిని వెళ్లగొడతారా? మానవీయ కోణాన్ని పరిశీలించిన అవసరం ఉంది అంటూ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది సుప్రీంకోర్టు. ఉత్తరాఖండ్‌లో రైల్వే భూమిలో అక్రమ కట్టడాల (నివాసాలను)ను కూల్చివేయాలంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇళ్లు నిర్మించుకుని దాదాపు 70 ఏళ్లుగా అక్కడ నివసించేవారిని ఖాళీ చేయించే పద్ధతి ఇది కాదని..వారిని పునరావాసాన్ని కల్పించి అప్పుడు అక్కడనుంచి ఖాళీ చేయించాలని స్పష్టంచేసింది. వారిని ఖాళీ చేయించటానికి పారా మిలటీరిని దించటాన్ని ఖండించింది. ఇటువంటి కేసుల్లో న్యాయం కంటే మానవీయ కోణాన్ని పరిగణిలోకి తీసుకోవాలని సూచించింది. రాత్రికి రాత్రే 50వేల మందిని వెళ్లగొట్టకూడదని స్పష్టం చేసింది.

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ జిల్లాలోని బన్‌భూల్‌పురా ప్రాంతంలో పలు నివాసాలు ఉన్నాయి. అక్కడ దాదాపు 50 నుంచి 70వేల మంది నివసిస్తున్నారు. వారు ఉన్న భూమి 29 ఎకరాల భూమి తమదేనని..ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించాలని రైల్వేశాఖ 2022లో కోర్టుకెక్కింది. రైల్వే శాఖకు సంబంధించిన స్థలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నవారిని ఖాళీ చేయించాలని ఉత్తరాఖండ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ అక్రమ కట్టడాలను కూల్చివేయాలని వారు అక్కడ నుంచి వారం రోజుల్లోగా ఖాళీ చేయించాలని డిసెంబర్ (2022)20న తీర్పు వెలువరించింది. వారిని అక్కడనుంచి ఖాళీ చేయించాలని వారు అడ్డుకుంటే పారామిలటరీ బలగాలతో ఖాళీ చేయించాలని జిల్లా పరిపాలన యంత్రాంగాన్ని ఆదేశించింది.

ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకున్నవారిలో ఎక్కువమంది ముస్లింలు. ప్రార్థన స్థలాలు, స్కూల్స్, వ్యాపార సముదాయాలు కూడా అక్కడున్నాయి.హైకోర్టు తీర్పుతో తీవ్ర ఆందోళన వ్యక్తంచేసిన స్థానికులు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్,ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం (జనవరి 5,2023)స్టే విధించింది.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి కేసుల్లో మానవీయ కోణంతో ముడిపడి ఉందని..50-70 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్నవారిని రాత్రికి రాత్రే వెళ్లగొట్టటం సరికాదు. వారికి పునరావాసం చూపించకుండా ఖాళీ చేయించే పద్ధతి సరికాదు. ఇటువంటి తీర్పులను మేం ప్రోత్సహించబోం. వారిని ఖాళీ చేయించటానికి పారామిలటీ బలగాలు రావాలా? ఇది ఎంతవరకు సమంజసం అంటూ జస్టిస్ ఓకా వ్యాఖ్యానించారు.మొత్తం భూమి రైల్వే శాఖదేనా? ప్రభుత్వానికి ఏమైనా ఉందా? అనే విషయాలపై స్పష్టత ఉండాలి. ఒకవేళ అంతా రైల్వేదే అయినా నివాసితుల కోసం ఏదైనా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది సుప్రీంకోర్టు.

దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తీర్పుతో హల్ద్వానీ ప్రాంతంలో హర్షం వ్యక్తంచేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. ధర్నాను విరమించారు.