Telangana Rains: దంచికొడుతున్న వానలు.. మబ్బులకు రంధ్రం పడిందా?

తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వానలకు పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి..

Telangana Rains: దంచికొడుతున్న వానలు.. మబ్బులకు రంధ్రం పడిందా?

Telangana Rains

Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. భారీ వానలకు పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. మంగళవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మబ్బులకు రంధ్రం పడిందా అన్నట్లు కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి.

ఇప్పటికే హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కామారెడ్డి తదితర జిల్లాల్లో వాగులు పొంగుతుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్‌, హనుమకొండ నగరాల్లో పలు కాలనీలు నీట మునిగాయి. కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరంగల్​ జిల్లాలో పలు మండలాలలో అతి భారీ వర్షాలు కురుస్తుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను కుండపోత వానలు వణికించాయి. కరీంనగర్, కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాల దెబ్బకు పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి.

రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప‌లు బ‌స్తీల్లోకి, ప‌లు కాల‌నీల్లోకి వ‌ర్ష‌పు నీరు చేరి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌, మేడిపల్లి, రామంతాపూర్‌, ఘట్‌కేసర్‌, బోడుప్పల్‌, పిర్జాదిగూడ, పోచారం తదితర ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన కాలనీల్లోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ఆయా ప్రాంతాలు చెరువుల్లో కాలనీలు ఉన్నాయా అనిపిస్తుంది. ఇక వాతావరణ శాఖ మరో రెండు రోజులు భారీ వర్షాలేనని హెచ్చరిస్తుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.