Hyderabad: దొంగలు ఎంతపని చేశారు.. రైలు నుంచి జారిపడి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
ట్రైన్ బీబీనగర్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంటుండగా కొందరు ట్రాక్ ల వద్ద నిలబడి శ్రీకాంత్ చేతిని కర్రలతో కొట్టారు.

Train Representative image
Hyderabad – Telangana techie: రైలులో సీటు దొరకక డోర్ వద్ద కూర్చొని వెళ్తున్న ఓ సాఫ్ట్ వేర్ నుంచి స్మార్ట్‌ఫోన్‌ను కొట్టేయడానికి ప్రయత్నించారు కొందరు దొంగలు. దీంతో ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుకోని రీతిలో ట్రైన్ నుంచి జారి పడి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri district) బీబీనగర్ రైల్వే స్టేషన్ (Bibinagar railway station) సమీపంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ లో ముప్పా శ్రీకాంత్ ఉద్యోగం చేస్తున్నాడు. తన సొంత ప్రాంతం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం నెరేళ్ల గ్రామానికి వెళ్లడానికి శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు.
అతడు కాజీపేట రైల్వే స్టేషన్లో దిగాల్సి ఉంది. ట్రైన్ రద్దీగా ఉండడంతో కంపార్ట్‌మెంట్ డోర్ వద్ద కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. ట్రైన్ బీబీనగర్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకుంటుండగా కొందరు ట్రాక్ ల వద్ద నిలబడి శ్రీకాంత్ చేతిని కర్రలతో కొట్టారు. దీంతో శ్రీకాంత్ స్మార్ట్‌ఫోన్ కింద పడిపోయింది.
ఒక్కసారిగా దాన్ని క్యాచ్ పట్టుకోబోయిన శ్రీకాంత్ ట్రైను కింద పడిపోయి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ గత ఏడాది హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ లో ఉద్యోగం సంపాదించాడు. తొలి ఏకాదశి సందర్భంగా తమ ఇంటికి వస్తాడనుకున్న శ్రీకాంత్.. విగతజీవిగా కనపడడంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.