National Herald case : నేషనల్ హెరాల్డ్ కేసుకు FIR కూడా లేదు..అదొక చిత్తుకాగితం : రేవంత్ రెడ్డి

నేషనల్ హెరాల్డ్ కేసుకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదని అదొక చిత్తుకాగితంతో సమానం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

National Herald case : నేషనల్ హెరాల్డ్ కేసుకు FIR కూడా లేదు..అదొక చిత్తుకాగితం : రేవంత్ రెడ్డి

National Herald Case

National Herald case: దేశంలో సోనియా, రాహుల్ గాంధీ గౌరవాన్ని తగ్గించే కుట్ర జరుగుతోందని బీజేపీ ప్రభుత్వమే ఈ కుట్రకు పాల్పడుతోంది అంటూ తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను తమ ఎదుట హాజరు కావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ నోటీసులతో రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు. ఈడీ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసనలు చేపట్టింది. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనల్లో భాగంగా రేవంత్ రెడ్డి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు. నేషనల్ హెరాల్డ్ కేసు అంటూ గాంధీ కుటుంబాల గౌరవాన్ని బీజేపీ ప్రభుత్వం దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతోంది అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు సంధించారు. అంతేకాదు నేషనల్ హెరాల్డ్ కేసుకు కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదని అదొక చిత్తుకాగితంతో సమానం అంటూ విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ అద్భుతమైన మెజార్టీతో తిరిగి అధికారంలోకి జరుగబోతోంది అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.

Also read :  National Herald Case: ఏమిటీ నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌కేం సంబంధం..

కాగా..కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడం, విచారణ జరుపుతున్న నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏంటీ నేషనల్ హెరాల్డ్ కేసు? సోనియా, రాహుల్‌తోపాటు ఇతర నేతలకు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటంటే..? సాతంత్ర్యోద్యమ సమయంలో, 1938లో జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను స్థాపించారు. అప్పట్లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో 1942లో దీనిపై బ్రిటీష్ ప్రభుత్వం నిషేధం విధించింది. తర్వాత 1945లో పత్రిక తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలో పత్రిక నష్టాల్లో ఉండేది. దీంతో పత్రిక నడిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం చేసింది. అప్పటినుంచి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆధ్వర్యంలో పత్రిక సాగేది. అనేక అవాంతరాలు ఎదుర్కొంటూ సాగిన పత్రిక 2008లో తిరిగి మూతపడింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి పత్రిక నిర్వహణా సంస్థ అయిన ఏజేఎల్ రూ.90 కోట్లు బాకీ పడింది.

Also read : National Herald case: విచార‌ణ ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ.. ఈ ప్ర‌శ్న‌లు అడిగిన ఈడీ

ఈ సంస్థ ఆస్తులు, బకాయిలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇదే సమయంలో 2010లో 50 లక్షల మూలధనంతో ‘యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్)’ అనే కంపెనీని కాంగ్రెస్ నేతలు స్థాపించారు. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెరో 38 శాతం (మొత్తం 76 శాతం) వాటా కలిగి ఉన్నారు. వీరితోపాటు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబేలు మిగతా 24 శాతం వాటా కలిగి ఉన్నారు. ఏజేఎల్ బకాయిలు తీర్చడానికి ఈ సంస్థను సోనియా, రాహుల్ వాటా కలిగి ఉన్న వైఐఎల్ సంస్థకు విక్రయించారు. ఈ కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, ఏజేఎల్ ఆస్తులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరించిందని ఆరోపణలొచ్చాయి. దాదాపు 2,000 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.

ఈ అంశంపై ఆయన కోర్టులో ఫిర్యాదు చేశారు. 2014లో ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై అప్పట్లోనే స్టే తెచ్చుకున్నారు. ఈ సంస్థకు సంబంధించిన రూ.64 కోట్లను 2019లో ఈడీ అటాచ్ చేసింది. అలాగే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును సోనియా గాంధీ ఆశ్రయించారు. అప్పట్నుంచి సాగుతున్న ఈ కేసులో తాజాగా సోనియా, రాహుల్‌లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆస్తుల విలువ దాదాపు రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.