Thiruppavai At Srivari Temple : శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్ధానంలో తిరుప్పావై

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమైంది.

Thiruppavai At Srivari Temple : శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్ధానంలో తిరుప్పావై

Tirumala

Thiruppavai At Srivari Temple :  తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమైంది. డిసెంబ‌రు 16న గురువారం మ‌ధ్యాహ్నం 12.26 గంట‌ల‌కు ధనుర్మాస ఘడియలు ప్రారంభమయ్యాయి. శుక్ర‌వారం నుండి 2022 జనవరి 14వ తేదీ వరకు ఆలయంలో సుప్రభాతం స్థానంలో శ్రీవారికి ఏకాంతంగా తిరుప్పావై నివేదిస్తారు.

పురాణ నేపథ్యంలో గోదాదేవి తాను ద్వాపరయుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

ధనుర్మాస వైశిష్ట్యం వివిధ పురాణాల్లో వివిధ విధాలుగా పేర్కొనబడింది. హైందవ సనాతన ధర్మానుసారం ఎవరైతే ఉదయాత్పూర్వం బ్రహ్మముహూర్తంలో కాలకృత్యాలు తీర్చుకొని భగవంతునికి భక్తిపూర్వకంగా పూజలు నివేదిస్తారో వారికి సకల సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయని ప్రశస్తి. ధనుర్మాసంలో శ్రీవారిని మధుసూధనుడిగా ప్రత్యేకించి కీర్తిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్ సృష్టిని లయబద్దంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుండే శ్రీకారం చుడతాడని కూడా పురాణప్రసిద్ధి.
Also Read : Datta Jayanthi 2021 : మార్గశిర పౌర్ణమి దత్త జయంతి
ఈ కారణంగానే ధనుర్మాసంలో ఉదయాత్పూర్వం బ్రహ్మముహూర్త కాలంలో లేచి శుచిగా పూజలు చేస్తారు. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాళ్‌ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదాకల్యాణం మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు.

డిసెంబ‌రు 19న పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌
పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబ‌రు 19న ఆదివారం గరుడసేవ జరుగనుంది. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకూ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.