Telangana : మా ప్రశ్నకు బదులేది-కమల నాధులపై గులాబీ దళం ప్రశ్నల పరంపర

తెలంగాణలో అసలు పొలిటికల్ గేమ్ మొదలైంది. బీజేపీ, టీఆర్ఎస్ టగ్‌ ఆఫ్‌ వార్ మరింత హీటెక్కింది.

Telangana : మా ప్రశ్నకు బదులేది-కమల నాధులపై గులాబీ దళం ప్రశ్నల పరంపర

Telangana

Telangana :  తెలంగాణలో అసలు పొలిటికల్ గేమ్ మొదలైంది. బీజేపీ, టీఆర్ఎస్ టగ్‌ ఆఫ్‌ వార్ మరింత హీటెక్కింది. తెలంగాణలో అధికారమే లక్ష్యం.. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని ప్రధాని మోదీ కుండబద్దలు కొడితే… కేసీఆర్ ప్రశ్నలు బదులేది అంటోంది గులాబీ పార్టీ. తెలంగాణకు ఏం ఇస్తారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని ప్రసంగంలో పసలేదని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు. బీజేపీ దూకుడుతో టీఆర్ఎస్‌ నెక్ట్స్ ప్లానేంటి?

ఇప్పటిదాకా ఒకలెక్క.. ఇప్పుడొక లెక్క అంటున్న కమలనాథులకు.. టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. హైదరాబాద్‌ వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశానికి, తెలంగాణకు ఏదో నిర్దేశనం చేస్తారనుకుంటే తుస్సుమనిపించారని గులాబీ దళం విమర్శిస్తోంది. బీజేపీ నేతలకు అధికార యావ, కేసీఆర్ స్మరణ తప్ప మరేమీ కనిపించలేదని.. అసలు విభజన చట్టం హామీల ఊసే లేదంటున్నారు.

హైదరాబాద్‌ అడ్డాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో తెలంగాణలో అధికారమే లక్ష్యమని చెప్పింది కమలం పార్టీ. అంతే కాదు తెలంగాణలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వచ్చితీరుతుందని చెప్పి ప్రధాని మోదీ…తెలంగాణ రాజకీయాల్లో కాకరేపారు. విజయసంకల్ప సభలో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ అన్న పేరు ఎత్తకుండా తనదైన స్టైల్‌లో విమర్శలు చేశారు. అభివృద్దే అజెండాగా రాజకీయ విమర్శలకు దూరంగా ప్రధాని ప్రసంగం సాగింది. గత పర్యటనల సమయంలో ప్రధాని తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శలు గుప్పించారు. కానీ ఈసారి అందరి అంచనాలను ఆయన తల్లకిందులు చేశారు. ఇక కేసీఆర్‌ సంధించిన ప్రశ్నలను అస్సలు పట్టించుకోలేదు మోదీ. పట్టణాలతో పాటు తెలంగాణలోని ప్రతి పల్లె అభివృద్ధి కోసం మరింత ఉత్సాహంగా పనిచేస్తామని.. తెలంగాణ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళతామన్నారు మోదీ.

అయితే ప్రధాని ప్రసంగానికి ఒకరోజు ముందు సీఎం కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు చెప్పలేదని టీఆర్ఎస్ రివర్స్ కౌంటర్ ఇస్తోంది. ప్రధాని ప్రసంగం ముగిసిన వెంటనే తమ ప్రశ్నలకు బదులేదని క్వశ్చన్ చేశారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పారిపోయారని విమర్శించారు. బీజేపీ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణకు ఏం చేస్తామో ఒక్క బీజేపీ నాయకుడు చెప్పలేదన్నారు. తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధుల గురించి ప్రధాని ప్రకటిస్తారనుకుంటే.. కనీసం ఆ ఊసే ఎత్తలేదన్నారు మంత్రి హరీశ్‌రావు.

దేశ ప్రధానిగా తెలంగాణకు ప్రధాని మోదీ చేసిందేమీ లేదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రానికి ప్రాజెక్టులు ఇచ్చామని, రోడ్లు వేయిస్తున్నామని, ధాన్యం కొంటున్నామన్న ప్రధాని మోదీ… దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని డిమాండ్ చేశారు. లేనిపోని మాటలు చెబితే తెలంగాణ ప్రజలు నమ్మరని తెలిపారు.

ప్రధాని మోదీ రెండ్రోజుల హైదరాబాద్‌ టూర్‌తో తెలంగాణకు ఉపయోగం లేదన్నారు మరో మంత్రి జగదీష్‌రెడ్డి. కేవలం తెలంగాణపై ఈర్ష్యా ద్వేషాలను వెళ్లగొక్కారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ప్రజలకు ఏం లాభం చేకూరదన్నారు. 8 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడుగొతామన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి గంగుల కమలాకర్. దమ్ముంటే ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యేను టచ్‌ చేసి చూడు అని సవాల్ విసిరారు. అసలు మీ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో ఉంటారో లేదో చూసుకోండన్నారు మంత్రి గంగుల.

మొత్తంమ్మీద మొన్నటిదాకా తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్‌గా ఉన్న రాజకీయం కాషాయదళం ఎంట్రీతో పూర్తిగా మారిపోయింది. జాతీయ కార్యవర్గ సమావేశాలతో టీఆర్ఎస్ వర్సెస్‌గా బీజేపీగా మారిపోయింది. మరి మోదీ సభతో బీజేపీకి కొత్త ఊపు వస్తుందా..? తెలంగాణలో బీజేపీ జెండా పాతేస్తుందా ఇకపై క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి బీజేపీ ఏం చేయబోతోంది అనేది ఆసక్తికరంగా మారగా… బీజేపీకి క్షేత్రస్థాయిలో అంత బలం లేదన్న అంశాన్ని అడ్వాంటేజ్‌గా వాడాకోవాలనుకుంటోంది.

Also Read : YS Jagan Mohan Reddy : ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల కడప పర్యటన ఖరారు