Virat Kohli: టీ20ల్లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఒకే స్టేడియంలో 3వేల పరుగులు
టీ20 క్రికెట్‌లో ఒకే స్టేడియంలో మూడు వేల పరుగలు సాధించిన మొదటి ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత అందుకున్నాడు.

Virat Kohli Completes 3000 Runs At Chinnaswamy Stadium
Virat Kohli: పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఒకే స్టేడియంలో మూడు వేల పరుగలు సాధించిన మొదటి ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ ఈ ఘనత అందుకున్నాడు. ఇందుకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికైంది. ఈ గ్రౌండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) హోమ్ గ్రౌండ్ అన్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లి ఆర్‌సీబీకి ఆడుతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి 37 బంతుల్లో 6 ఫోర్లతో 54 పరుగులు చేశాడు.
కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటి వరకు కోహ్లి ఆర్‌సీబీ పై 858 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 1075 పరుగులతో కేకేఆర్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మొదటి స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 858 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 850 పరుగులతో ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో జేసన్ రాయ్(56; 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకంతో అలరించగా నితీశ్ రాణా(48; 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో హసరంగ, వినయ్‌కుమార్ రెండు వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు. లక్ష్య ఛేదనలో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా 21 పరుగుల తేడాతో గెలిచింది. బెంగళూరు బ్యాటర్లలో విరాట్ కోహ్లి(54; 37 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధశతకంతో రాణించినప్పటికి మిగిలిన వారు విఫలం అయ్యారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా సుయాష్ శర్మ, రస్సెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.