Virat Kohli: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్‌లో ఒకే ఒక్క‌డు

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో ఏడువేల ప‌రుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెట‌ర్‌గా అవ‌త‌రించాడు.

Virat Kohli: చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్‌లో ఒకే ఒక్క‌డు

Virat Kohli 7000 runs in IPL

Virat Kohli: ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి(Virat Kohli) చ‌రిత్ర సృష్టించాడు. శ‌నివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(Delhi Capitals)తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లి 46 బంతుల్లో 55 ప‌రుగులు చేశాడు. వ్య‌క్తిగ‌త స్కోరు 12 ప‌రుగుల వ‌ద్ద ఐపీఎల్‌(IPL)లో ఏడువేల ప‌రుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెట‌ర్‌గా అవ‌త‌రించాడు. ఈ ఘ‌న‌త‌ను అత‌డు త‌న సొంత మైదానంలో అందుకోవ‌డం విశేషం. విరాట్ 233 మ్యాచుల్లో ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. ఐదు శ‌త‌కాలు, 49 అర్ధ‌శ‌త‌కాలు కోహ్లి ఖాతాలో ఉన్నాయి.

ఇప్ప‌టికే ఐపీఎల్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా విరాట్ కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అత‌డి త‌రువాత శిఖ‌ర్ ధావ‌న్‌(6536), డేవిడ్ వార్న‌ర్(6189), రోహిత్ శ‌ర్మ‌(6063) లు వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

దీనిపై మ్యాచ్ అనంత‌రం కోహ్లి మాట్లాడుతూ సొంత మైదానంలో కుటుంబ స‌భ్యులు, చిన్న‌నాటి కోచ్ ముందు ఈ ఘ‌న‌త‌ను అందుకోవ‌డం త‌న‌కి ఎంతో సంతోషంగా ఉంద‌న్నాడు. ఇది త‌న‌కు ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భంగా చెప్పాడు. తాను ఇక్క‌డే క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాన‌ని, ఇక్క‌డే త‌న ఆట చూసిన సెల‌క్ట‌ర్లు త‌న‌ను ఎంపిక చేసిన‌ట్లు గుర్తు చేసుకున్నాడు. ఈ మైదానం త‌న‌కు ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని, ఇలాంటి అద్భుత‌మైన విష‌యాల‌తో దేవుడు త‌న‌ను ఆశీర్వ‌దించాడ‌ని విరాట్ కోహ్లి అన్నాడు.

భార్య అనుష్క శ‌ర్మ ఈ ప‌ర్య‌ట‌న‌లో త‌న‌తో పాటే ఉండ‌డం ఎంతో ప్ర‌త్యేకంగా ఉంద‌న్నాడు. ఎన్ని ప‌నులు ఉన్న‌ప్ప‌టికి కుటుంబం కోసం అధిక స‌మ‌యం కేటాయించ‌డ‌మే త‌న‌కు అత్యంత ఇష్ట‌మైన విష‌య‌మ‌ని విరాట్ చెప్పుకొచ్చాడు. ‘క్రికెట్ నా జీవితంలో ఒక భాగం. అనుష్క మ్యాచ్ చూడ‌డానికి వ‌చ్చిన‌ప్పుడు ఇంకా గొప్ప‌గా అనిపిస్తుంది.’ కోహ్లి అన్నాడు. ప్ర‌స్తుత సీజ‌న్‌లో విరాట్ కోహ్లి 10 మ్యాచుల్లో 419 ప‌రుగులు చేసి అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇందులో ఆరు అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లి(55; 46 బంతుల్లో 5 ఫోర్లు), మహిపాల్ లోమ్రోర్(54 నాటౌట్‌; 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) లు అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించారు. అనంత‌రం ల‌క్ష్యాన్ని ఢిల్లీ 16.4 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫిలిప్ సాల్ట్(87; 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) దూకుడుగా ఆడ‌గా రిలీ రోసో(35; 22 బంతుల్లో 1 ఫోర్‌, 3సిక్సులు) రాణించాడు.