అర్జున్ సురవరం – రివ్యూ

నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా.. టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ సురవరం’ మూవీ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : November 29, 2019 / 09:57 AM IST
అర్జున్ సురవరం – రివ్యూ

నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా.. టి.సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ సురవరం’ మూవీ రివ్యూ..

కెరీర్  ముందు నుండి ఇమిటేషన్ స్టార్ అని పేరు తెచ్చుకున్న నిఖిల్ ‘స్వామి రారా’ సినిమాతో తన దారి మార్చుకుని తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాల సక్సెస్ నిఖిల్ కెరీర్ గ్రాఫ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళింది. నిఖిల్ ఒక సినిమా అంటే అందులో ఖచ్చితంగా మంచి పాయింట్ ఉంటుంది అని ఫిక్స్ అయిపోయారు ప్రేక్షకులు.. కానీ ‘కేశవ’ ఒక మోస్తరుగా ఆడడం, ‘కిరిక్ పార్టీ’ రీమేక్‌గా తెరకెక్కిన ‘కిర్రాక్ పార్టీ’ ఫ్లాప్ అవడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ తరువాత తమిళ్ సినిమా ‘కనిధన్’కి రీమేక్‌గా ‘ముద్ర’ పేరుతో సినిమా మొదలుపెట్టాడు. మళ్ళీ ‘అర్జున్ సురవరం’ అంటూ పేరు మార్చారు. కానీ ఆ సినిమా మొదలుపెట్టిన ముహూర్తబలం ఏంటో కానీ ఈ మధ్య కాలంలో ఆ సినిమా పడిన కష్టాలు వేరే ఏ సినిమా కూడా పడలేదు. సంవత్సరం నుండి డేట్స్ ఇస్తూ పోస్ట్ పోన్ చేసిన ఆ సినిమా ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది.నిఖిల్ సినిమా లేట్ అయిన ప్రతిసారి సక్సెస్ సొంతం చేసుకుంది.మరి మెగాస్టార్‌నే మెప్పించిన ఈ ‘అర్జున్ సురవరం’ ఎలాంటి రిజల్ట్ అందుకుంది అనేది ఇప్పుడు చూద్దాం.

సినిమా కథ విషయానికి వస్తే :
అర్జున్ లెనిన్ సురవరం ఓ ఛానల్‌లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తుంటాడు. అయితే బీబీసీ ఛానెల్‌లో పనిచెయ్యాలి అనేది అతని గోల్. ఒక స్ట్రింగ్ ఆపరేషన్ కోసం ఒక పబ్‌కి వెళ్లిన అర్జున్‌కి కావ్య పరిచయం అవుతుంది. ఆమెకి తాను బీబీసీలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నట్టు గొప్పలు చెబుతాడు. వాళ్ళిద్దరి పరిచయం కాస్త పెరిగి ప్రేమగా మారుతుంది. కానీ అంతలో అర్జున్ పనిచేస్తున్నది బిబీసిలో కాదు అని తెలుస్తుంది. దాంతో కావ్య అర్జున్‌ని అసహ్యించుకుంటుంది. కానీ తన తండ్రి వల్ల అర్జున్ ఎలాంటి వాడు అనేది తెలుసుకుంటుంది. ఈలోగా అర్జున్‌కి బీబీసీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా జాబ్ వస్తుంది. అంతా హ్యాపీ అనుకున్న టైమ్‌లో అర్జున్‌ది నకిలీ సర్టిఫికెట్ అని, ఎడ్యుకేషన్ లోన్ కింద అనేక బ్యాంక్స్ నుండి చాలా లోన్ కూడా తీసుకున్నాడు అని రకరకాల కేసుల్లో అతన్ని అరెస్ట్ చేస్తారు. అతన్ని మాత్రమే కాదు చాలామందిని నకిలీ సర్టిఫికెట్స్ కేసులో అరెస్ట్ చేస్తారు. అసలు ఈ నకిలీ సరిఫికేట్స్ కేసులు ఏంటి? దానివెనుక ఉన్నది ఎవరు? అర్జున్ వాళ్ళను కనిపెట్టగలిగాడా..? తనును తాను నిర్దోషిగా నిరూపించుకున్నాడా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

ఇక నటీనటులు విషయానికి వస్తే :

నిఖిల్‌ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తాన్ని మొదటి నుంచి చివరివరకు తన భుజాలపై మోశాడు. జర్నలిస్ట్ పాత్రలో ఒదిగిపోయాడు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పాత్ర హీరో వెంట క్లైమాక్స్‌ వరకు ఉన్నప్పటికీ యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ లేని పాత్ర దక్కింది. వీళ్ళిద్దరి మధ్యలో లవ్‌ట్రాక్‌ కూడా ఒకటిరెండు సీన్లకే పరిమితమైంది. హీరో స్నేహితుడిగా, లాయర్‌గా వెన్నెల కిషోర్‌ మరోసారి తన మార్క్ కామెడీతో అలరించే ప్రయత్నం చేశాడు. విలన్‌ పాత్రలో తరుణ్‌ అరోరా ఆకట్టుకున్నాడు, పోసాని కృష్ణమురళి, నాగినీడు, విద్యుల్లేఖ, ఇతర నటులు తమ పరిధమేరకు ఆకట్టుకున్నారు. 

టెక్నిషియన్స్ విషయానికి వస్తే :
దర్శకుడు సంతోష్.. ఒరిజినల్ సినిమా ‘కనిధన్’‌ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథను మలచడంలో పర్వాలేదు అనిపించాడు. కానీ ద్వితీయార్ధంలో.. మరింత ఆసక్తికరంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సీన్లు రాసుకుంటే బాగుండేది. క్లైమాక్స్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఒక రకంగా.. దర్శకుడు తను అనుకున్న కథను పూర్తి స్థాయిలో తెరకెక్కించడంలో తడబడ్డాడు అని  చెప్పాలి. ఇక శ్యామ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్  హైలెట్‌గా చెప్పుకోవచ్చు. సూర్య సినిమాటోగ్రఫీ అలరిస్తుంది. కథకు తగినట్టు తన ఫ్రేమ్స్‌తో సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టు ఉన్నాయి..

ఓవరాల్‌గా చెప్పాలంటే : 
అన్ని అడ్డంకులు దాటుకుని థియేటర్స్‌లోకి వచ్చిన ‘అర్జున్  సురవరం’ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంత విఫలం అయిందనే చెప్పాలి. బీ, సీ సెంటర్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే.. మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. బాక్సాఫీస్ దగ్గర సరైన సినిమాలేవీ లేకపోవడంతో గట్టేక్కే ఛాన్సెస్ ఉన్నాయి..

ప్లస్ పాయింట్స్ :
కథ
నిఖిల్ పెర్ఫామెన్స్ 
సినిమాటోగ్రఫీ
బ్యాగ్రౌండ్ స్కోర్ 

మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్ 
క్లైమాక్స్ 
లాజిక్ లేని సీన్స్