థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల ప్రారంభంపై ఈ 8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ

  • Published By: sreehari ,Published On : September 5, 2020 / 09:32 PM IST
థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల ప్రారంభంపై ఈ 8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ

కరోనా సంక్షోభంతో మూతపడ్డ అన్ని రంగాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు సైతం తెరుచుకున్నాయి. మెట్రో సర్వీసులు కూడా సెప్టెంబర్ 7 నుంచి పున: ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లకు ఇంకా అనుమతి లేదు.. మరి సినిమా థియేటర్లు ఎప్పటినుంచి తెరుచుకోనున్నాయనేది స్పష్టత లేదు..



అయితే సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ ల ప్రారంభంపై ఈ నెల 8న సినీరంగానికి చెందిన ప్రముఖులతో కేంద్ర హోంశాఖ అధికారులు సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ఈ సమావేశంలో నిర్వహించనున్నారు. థియేటర్లు తెరుచుకునే తేదీ, కోవిడ్ నిబంధనలు పాటించాల్సిన నిబంధ‌న‌ల‌పై చర్చించే అవకాశం ఉంది. ఈ స‌మావేశం అనంత‌రం థియేటర్లు తెరవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుద‌ల చేసే అవకాశం ఉంది.



కరోనా సంక్షోభం తీవ్ర నష్టాలను ఎదుర్కొన్న రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి.. కరోనా లాక్ డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలకు పైగా సినీ థియేటర్లు మూతబడ్డాయి. అప్పటికే రిలీజ్ కు రెడీగా ఉన్న చాలా సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లలో విడుదల చేసే పరిస్థితులు లేకపోవడంతో చాలా వరకు చిన్న సినిమాల నిర్మతలు ఆన్ లైన్ ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా విడుదల చేశారు.. భారీ బడ్జెట్ తో తీసే బడా హీరోల సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలంటే ఆలోచిస్తున్నారు నిర్మాతలు.. ప్రభుత్వం నుంచి థియేటర్లకు ఎప్పుడు అనుమతి లభిస్తుందా అని ఎదురు చూస్తున్నారు.