సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం: యాక్షన్‌లు, రిలీజ్‌లు లేవు.. అంతా ప్యాకప్‌యే

సినీ ఇండస్ట్రీకి భారీ నష్టం: యాక్షన్‌లు, రిలీజ్‌లు లేవు.. అంతా ప్యాకప్‌యే

యావత్‌ ప్రపంచంతో పాటు తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మహా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా ఇండస్ట్రీలో షూటింగుల నుంచి రిలీజుల దాకా ఆగిపోయాయి. వైరస్‌ వ్యాప్తి ప్రారంభమయ్యే సమయానికి విడుదలకు సిద్ధమైన సినిమాలు దాదాపు పాతిక ఉంటే.. సెట్స్‌పై మరో 50 మూవీస్‌ దాకా ఉన్నాయి. కరోనా దెబ్బతో షూటింగ్‌ ప్రారంభమే కాకుండా ఆగినవి అంతకుమించే ఉన్నాయి. మొత్తంగా చిత్ర నిర్మాణమే పూర్తిగా స్తంభించిపోయింది.

500 కోట్లకు పైగా విలువైన సినిమాలకు బ్రేక్‌ పడింది. షూటింగ్‌ సగంలో దాదాపు 50కి పైగా సినిమాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 1700 థియేటర్లు మూతబడ్డాయి. దీంతో 50 వేల మంది ఉపాధిపై దెబ్బ పడింది. అదే స్థాయిలో నిర్మాతలపై ఊహించని విధంగా వడ్డీ భారం పెరుగుతోంది. పదుల కోట్ల పన్ను రాబడి పోయి ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. తెలుగు సినీ పరిశ్రమకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని గడ్డుకాలాన్ని ఫేస్ చేస్తోంది.

అంతా రెడీ అయి విడుదల ఆగిన సినిమాలు.. షూటింగ్‌ మొదలై మధ్యలో నిలిచిపోయిన నష్టాన్ని ఇప్పటికిప్పుడు అంచనా వేసి చెప్పలేని పరిస్థితి. కరోనాతో సినిమా పరిశ్రమలో ఈ ఏడాది సినిమా రిలీజుల సంఖ్య సాధారణ సగటుతో పోలిస్తే సగానికి పైగా పడిపోయింది. గతేడాది తెలుగులో 269 చిత్రాలు రిలీజ్‌ కాగా.. ఈ ఏడాది అందులో సగం కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు.

కరోనాతో చాలా రోజుల నుంచే సినిమాల షూటింగ్‌లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. వైరస్‌ వీర విహారంతో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ వాయిదాపడింది. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. తొలి షెడ్యూల్‌ పూర్తయ్యాక వారణాసిలో షూటింగ్‌ స్టార్ట్‌ కావాల్సి ఉంది. కానీ వైరస్ ఎంట్రీతో ప్యాకప్ చెప్పేశారు. వచ్చే సంక్రాంతికి రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేశారు.

ఈ సినిమాలో బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌ నటులు కూడా నటిస్తున్నారు. కీలకమైన సన్నివేశాల్ని పుణెలో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ సినిమా చిత్రీకరణపై కరోనా ఎఫెక్ట్ పడింది. పవన్‌కల్యాణ్‌ వకీల్‌సాబ్‌, నాగార్జున వైల్డ్‌డాగ్‌, వెంకటేష్‌ నారప్ప, ప్రభాస్‌ కథా నాయకుడిగా రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం… ఇవన్నీ సగానికి పైగానే పూర్తయ్యాయి.

రవితేజ క్రాక్‌, రానా విరాటపర్వ, నాగచైతన్య లవ్‌స్టోరీ, శర్వానంద్‌ శ్రీకారం, సాయిధరమ్‌ తేజ్‌ సోలో బ్రతుకే సో బెటరూ, అఖిల్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, నితిన్‌ రంగ్‌దే, మంచు విష్ణు మోసగాళ్లు, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ అల్లుడు అదుర్స్‌, అల్లరి నరేష్‌ నాంది చిత్రాలు ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నాయి. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారు. కానీ ఇవన్నీ కరోనా కారణంగా అంత ఈజీగా సెట్స్‌పైకి వెళ్లేలా కనిపించడం లేదు.

ఈ మధ్యే బిగ్-బి అమితాబ్ బచ్చన్‌కి కరోనా సోకింది. ఇంట్లో ఉన్న వాళ్లకే కరోనా రాదన్న గ్యారంటీ లేకుండా పోయింది. దీంతో షూటింగ్‌లో ముఖ్య నటులకి, సినిమా యానిట్‌లో ఎవరికైనా వైరస్ సోకితే.. ప్రణాళికలన్నీ తారుమారు కావడం ఖాయం. అందుకే వ్యాక్సిన్ వచ్చేదాకా షూటింగ్స్‌ మొదలెట్టకపోవడమే మంచిదంటున్నారు పవన్ కల్యాణ్.

కరోనాకి ముందు సెట్స్‌పై ఉన్న సినిమాల మార్కెట్‌ విలువ వేల కోట్ల పైమాటే అనేది సినీ వర్గాల మాట. హక్కుల అమ్మకాలు, విడుదలకి ముందస్తు వ్యాపారాలు, అడ్వాన్సులు… ఇలా సినిమాలు సెట్స్‌పై ఉన్నప్పుడే లావాదేవీలు జరుగుతాయి. కరోనాతో సినిమాలు ఆగడంతో వ్యాపారం నిలిచిపోయింది. ఏదైనా సినిమా ఎక్కువ రోజులు సెట్స్‌పై ఉందంటే దానిపైన పెట్టుబడులు, వడ్డీలు నిర్మాతలకి భారంగా మారే ప్రమాదం ఉంది. అందుకే వీటిని పూర్తి చేయాలని భావిస్తున్నప్పటికీ.. వైరస్ కేసుల పెరుగుతుండడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

దాదాపు 10మంది స్టార్‌ హీరోల ప్రాజెక్ట్‌లు మధ్యలో ఆగాయి. మరో 40 దాకా చిన్న చిత్రాలు సగంలో నిలిచిపోయాయి. రాజమౌళి సినిమాకు 200 కోట్లు, పెద్ద హీరోల చిత్రాలన్నీ కలిపి మరో 200 కోట్లు, చిన్న సినిమాలకు తలా రెండున్నర కోట్లుగా లెక్క వేసుకున్నా.. కరోనా కాలంలో అండర్‌ ప్రొడక్షన్‌లో దాదాపు 500 కోట్ల విలువైన సినిమాలు ఆగిపోయాయని స్పష్టమవుతోంది. ఈ సినిమాల నిర్మాణం కోసం ఫైనాన్షియర్ల నుంచి అప్పులు తేవడం సహజం.

నెలకు రెండున్నర రూపాయల వడ్డీ వేసుకున్నా, ఆగిపోయిన సినిమాల మీద గత నాలుగు నెలల్లోనే పాతిక కోట్లకు పైగా వడ్డీ భారం పడుతుంది. మొత్తం అంతా ముందే అప్పు తెచ్చి ఉండరనుకున్నా.. కనీసం 15 కోట్ల వడ్డీ నిర్మాతలపై పడి ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సినీ పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం విషయంలో ప్రభుత్వంపైనా కరోనా దెబ్బ పడింది. ఏటా సగటున 150 నుంచి 190 దాకా స్ట్రెయిట్‌ సినిమాలు.. 50 నుంచి 70 దాకా డబ్బింగ్‌ చిత్రాలు రిలీజ్ అవుతాయి. కేవలం స్ట్రెయిట్‌ తెలుగు చిత్రాల లెక్క చూసినా తెలుగు సినీ పరిశ్రమ టర్నోవర్‌ దాదాపు 1000 కోట్లు ఉంటుంది. 1500 కోట్ల మేర వ్యవహారం సాగినప్పుడే ఆ టర్నోవర్‌ సాధ్యం. కానీ, కరోనా దెబ్బతో కనీసం నాలుగు నెలలకు పైగా పరిశ్రమ స్తంభించిపోయింది.

ఈ రెండొంతుల కాలాన్ని తీసేసి.. మిగిలిన రెండొంతుల కాలంలోని సినీ వ్యాపారం మీద ప్రభుత్వానికి పన్ను రూపేణా ఆదాయం రావాలి. వినోదపు పన్ను స్థానంలో వసూలు చేస్తున్న 18 శాతం జీఎస్టీ ప్రకారం.. ఈ కరోనా కాలానికి ప్రభుత్వానికి అధికారికంగా వందకోట్లకు పైగా ఆదాయం రావాలి. సినీరంగంలోని కాకి లెక్కలు, తిరకాసులు పరిగణనలోకి తీసుకున్నా 50కోట్ల రూపాయలకు పైగానే వచ్చేది. కానీ ఇప్పుడు సినిమా సీన్ రివర్సయింది.

కరోనా కాటుకు వినోద రంగం ఢమాల్ అయింది. సినిమా షూటింగ్స్, రిలీజ్ లు ఆగిపోవడంతో పాటు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంకా చెప్పాలంటే సినీ పరిశ్రమ ఓ ఏడాది వెనక్కి వెళ్లిపోయింది.