Republic Review : ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ..

Republic Review : ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

Republic Review

Republic Review: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా.. విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ కాగా‏.. సీనియర్ నటులు రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. ప్రోమోలు ఆసక్తికరంగా అనిపించడంతో పాటు.. విడుదలకు ముందే సినిమా చూసిన పలువురు సెలబ్రిటీలు పాజిటివ్ టాక్ చెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రిపబ్లిక్’ మూవీ ఎలా ఉందో చూద్దాం..

Republic Trailer : ‘అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది’..

కథ..
పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) చిన్నప్పటి నుంచి బ్రిలియంట్ స్టూడెంట్.. తండ్రి దశరథ్ (జగపతి బాబు) గెజిటెడ్ ఆఫీసర్.. అతను లంచాలు తీసుకోవడం నచ్చని అభి చిన్నతనంలోనే పిల్లలకు ట్యూషన్లు చెబుతూ సొంతంగా సంపాదిస్తూ.. కష్టపడి చదివి యూఎస్ వెళ్లే ప్లాన్‌లో ఉంటాడు. తన మేనల్లుడు చదివే స్కూల్‌లో అతనికి యూఎస్ నుంచి వచ్చిన మరియా హ్యాన్సన్ పరిచయం అవుతుంది. ఆమెకి చెప్పడు కానీ తనతో చిన్నపాటి రిలేషన్ మెయింటెన్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు.

తెల్లేరులో గుణ అనే రౌడీ అరచకాలు మీతిమీరుతుంటాయి. అతనికి మంత్రి విశాఖ వాణి (రమ్యకృష్ణ) సపోర్ట్ ఉంటుంది. తన ఓటు రిగ్గింగ్ చేశారని అభి పోలింగ్ బూత్‌లో గొడవపడడంతో గుణ మనుషుల కంట్లో పడతాడు. ఆటో మణి (రాహుల్ రామకృష్ణ) ఇంటి సమస్యలో ఇన్వాల్వ్ అయ్యి అనుకోకుండా గుణకే ఎదురు పడడంతో అతను అభికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.

Republic

ఇదిలా ఉండగా ఆటో మణిని అభి కళ్ల ముందే గుణ, అతని మనుషులు చంపేస్తారు. తెల్లేరు చెరువులు, ప్రజలు, వాళ్ల సమస్యలు, రాజకీయాల చుట్టూ కథ తిరుగుతుంటుంది. మరియా హ్యాన్సన్ వాళ్ల అన్నయ్య డాక్టర్ వరుణ్ హ్యాన్సన్ కనిపించకుండా పోవడంతో ఆమె అభి సాయంతో పోలీసులను ఆశ్రయిస్తుంది. కొద్ది రోజులకి అతను చనిపోయాడని తెలుస్తోంది. అన్నయ్య పిల్లలను తీసుకుని మరియా యూఎస్ వెళ్లిపోతుంది.

అనేక మలుపుల తర్వాత తన సొంత గ్రామం తెల్లేరుకి కలెక్టర్‌గా ఎంపికవుతాడు అభిరామ్. అక్కడి నుంచి కథ కీలక మలుపులు తిరుగుతుంది. కలెక్టర్‌గా బాధ్యత తీసుకున్న ఫస్ట్ డే పోలీస్ (మనోజ్ నందం) సాయంతో గుణను ఎన్‌కౌంటర్ చేయిస్తాడు అభి. అదే ప్రాతంలో తీవ్ర గాయాలతో ఉన్న మరియా కంట పడుతుంది. అమెరికా వెళ్లాల్సిన మరియా ఇక్కడికెలా వచ్చింది.. ఆమె అన్నయ్య పిల్లలు ఏమయ్యారు..

అసలు తెల్లేరు చెరువు వెనకాల ఏళ్ల తరబడి రాజకీయం ఎలా వేళ్లూనుకుపోయింది. అనే ఆసక్తికర విషయాలు తెలుసుకున్న అభి, విశాఖ వాణికి ఎదురు తిరిగుతాడు. ఆమె వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ గట్టి పోటీనిస్తాడు. చివరకు కోర్టులో విజయం సాధిస్తాడు. విశాఖ వాణి, అభి తండ్రి దశరథ్ లతో పాటు మరో ఇద్దరు అధికారులకు కోర్టు శిక్ష విధిస్తుంది. తెల్లేరు సమస్య తీరిపోయింది అనుకుంటే మరో కొత్త సమస్య మొదలవుతుంది. ఆ సమస్య కారణంగా, మనుషుల స్వార్థం కారణంగా అభిరామ్ బలవ్వాల్సి వస్తుంది..

నటీనటులు..
సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఈ ‘రిపబ్లిక్’ సినిమా మరో ఎత్తు అని చెప్పాలి.. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తేజ్.. ఎమోషనల్ సీన్స్‌లో హావభావాలతో ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు అనడం కంటే ఈ క్యారెక్టరే అతణ్ణి సెలెక్ట్ చేసుకుంది అనడం బెటర్.. ఈ కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడే తేజ్ నటుడిగా ఛాలెంజింగ్ రోల్ చెయ్యడానికి ఫిక్స్ అయిపోయాడు.. ఐశ్వర్య రాజేష్ నటనకు ఆస్కారమున్న రోల్‌లో ది బెస్ట్ ఇచ్చింది. ఇక రమ్యకృష్ణ చాలా కాలం తర్వాత నెగెటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్‌లో అదరగొట్టేసింది. సినిమాకు వెన్నముకలాంటి విశాఖ వాణి పాత్రను ఆమె తప్ప మరెవరూ చెయ్యలేరనిపించేలా చేశారు. ఇక జగపతి బాబు క్యారెక్టర్ కూడా సినిమాకు వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అనే చెప్పాలి.. మిగతా నటీనటులంతా తమ క్యారెక్టర్ల మేర చక్కగా నటించి మెప్పించారు.

Republic

టెక్నీషియన్స్..
ఎం. సుకుమార్ ఫొటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది. విజువల్స్ రిచ్‌గానే కాకుండా.. దర్శకుడి విజన్‌ని అర్థం చేసుకుని ఆయన తీసిన సింబాలిక్ షాట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మణిశర్మ మరోసారి తన మార్క్ బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అలరించారు. రెండు పాటలు ప్లస్ థీమ్ సాంగ్స్‌లో తన పనితనం చూపించారు. మిగతా టెక్నీషియన్లు ఎఫర్ట్ సినిమాకు ప్లస్ అయ్యింది. ఇక డైరెక్టర్ దేవ కట్టాకు ‘రిపబ్లిక్’ కమ్‌బ్యాక్ సినిమా.. తెల్లేరు ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనలు క్షుణ్ణంగా పరిశీలించి, దాని మీద రీసెర్చ్ చేసి మంచి కథ రాసుకున్నారు. దానికి ఎమోషన్‌ని యాడ్ చేసి అంతే చక్కగా ప్రెజెంట్ చేశారు. తన మార్క్ డైలాగులు డైనమెట్స్‌లా పేలడమే కాక ఆలోచింప చేసేలా ఉన్నాయి. అలాగే తన స్టైల్ స్క్రీన్‌ప్లేతో మ్యాజిక్ చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే..
దర్శకుడు దేవ కట్టా సందర్భానుసారం రెండు పాటలు, థీమ్ సాంగ్స్, ఫైట్స్ తప్ప కామెడీ ట్రాక్, ఐటెం సాంగ్స్ ఇంకా ఇతరత్రా కమర్షియల్ హంగులకు పోకుండా డైరెక్ట్‌గా కథ చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయాలంటే ఏంటో.. అవి ఎలా ఉంటాయో జనాలకు చూపించారు.. భావోద్వేగాలతో ఆలోచింపజేసేలా ఉన్న ‘రిపబ్లిక్’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది..