Maharashtra Assembly : 12 బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాదిపాటు అనర్హత వేటు

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

Maharashtra Assembly : 12 బీజేపీ ఎమ్మెల్యేలపై ఏడాదిపాటు అనర్హత వేటు

Maharashtra2

Maharashtra Assembly మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ 12మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

సోమవారమే మ‌హారాష్ట్ర అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. అయితే, రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్.. రాష్ట్రంలోని ఓబీసీ జనాభాకి సంబంధించి అనుభావిక డేటా సిద్దం చేసేందుకు సాధ్యపడేలా 2011 జనాభా లెక్కల డేటాని అందించాలని కేంద్రాన్ని కోరుతూ ఓ తీర్మాణాన్ని అసెంబ్లీలో రాష్ట్ర మంత్రి చగ్గన్ భుజ్ భల్ ప్రవేశపెట్టారు. అయితే బీజేపీ నేతల కేకలు,అరుపుల మధ్యనే మూజువాణి ఓటు ద్వారా తీర్మాణాన్ని ఆమోదం తెలుపుతున్నట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు.

అయితే తీర్మాణాన్ని ఓటింగ్ కి పెట్టిన సమయంలోనే పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంపైకి ఎక్కి..స్పీకర్ తో వాదనకు దిగారు. స్పీకర్‌పై దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఆయన్ను నోటికొచ్చినట్టు దుర్భాషలాడినట్టు సమాచారం. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న వ్యక్తిని కించపరిచేలా వ్యవహరించారని, 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఏడాది పాటు బహిష్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల‌లో.. సంజ‌య్ కూటె, ఆశిష్ షేల‌ర్‌, అభిమ‌న్యు ప‌వార్‌, గిరీశ్ మ‌హాజ‌న్‌, అతుల్ భ‌త్కాల్క‌ర్‌, ప‌రాగ్ అలావ్నీ, హ‌రీష్ పింపాలే, రామ్ స‌త్పుటే, విజ‌య్‌కుమార్ రావ‌ల్‌, యోగేశ్ సాగ‌ర్‌, నారాయ‌ణ్ కూచె, కీర్తికుమార్ బాంగ్డియా ఉన్నారు.

అయితే ఆ గొడ‌వ స‌మ‌యంలో అసెంబ్లీలోనే ఉన్న ప్ర‌తిప‌క్ష నేత దేవేంద్ర ఫ‌డ్నవీస్ మాత్రం ఇవ‌న్నీ త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ని కొట్టిపారేశారు. బీజేపీ సభ్యులెవరూ స్పీకర్‌ ను కించపరచలేదని ఫ‌డ్న‌వీస్ మీడియాకు తెలిపారు. వర్షాకాల సమావేశాను బీజేపీ బాయ్ కాట్ చేస్తున్నట్లు ఫడ్నవీస్ ప్రకటించారు.