Article 370 రద్దుకి రెండేళ్లు..జమ్మూకశ్మీర్ లో వచ్చిన 5 పెద్ద మార్పులు ఇవే

జమ్ముకశ్మీర్‌ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370, ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 35(A)ని కేంద్రం రద్దు చేసి నేటికి రెండేండ్లు పూర్తయ్యాయి.

Article 370 రద్దుకి రెండేళ్లు..జమ్మూకశ్మీర్ లో వచ్చిన 5 పెద్ద మార్పులు ఇవే

Kashmir

Article 370 జమ్ముకశ్మీర్‌ కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370, ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 35(A)ని కేంద్రం రద్దు చేసి నేటికి రెండేండ్లు పూర్తయ్యాయి. జమ్మూకశ్మీర్ ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా(జమ్మూకశ్మీర్,లడఖ్) ఆగస్టు-5,2019న విభజించిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండేళ్లలో జమ్మూకశ్మీర్ లో చోటు చేసుకున్న పెద్ద మార్పులు ఏంటో ఒక్కసారి చూద్దాం.

జమ్మూకశ్మీర్ లో ఎవరైనా భూమి కొనుగోలు చేయవచ్చు : గతంలో లేని విధంగా.. దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వారైనా జమ్మూకశ్మీర్ లో భూమి లేదా స్థలం కొనుగోలు చేసేలా గతేడాది అక్టోబర్ లో కేంద్రం మార్గం సుగుమం చేసింది. గతేడాది కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో.. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి చట్టంలోని సెక్షన్ 17 నుండి “రాష్ట్రంలో శాశ్వత నివాసి” అనే పదబంధాన్ని తొలగించింది. ఏదేమైనా, కొన్ని సందర్భాల్లో మినహా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర రైతులకు బదిలీ చేయడానికి అనుమతించలేదు.

స్థానికేతరులుగా ఉండే జమ్మూకశ్మీర్ మహిళల భర్తలకి శ్వాశ్వత నివాస హోదా
: జమ్మూ కాశ్మీర్ వెలుపల వ్యక్తులను జమ్మూకశ్మీర్ మహిళ వివాహం చేసుకున్నట్లయితే..స్థానిక(జమ్మూకశ్మీర్) మహిళల భర్తలకు నివాస ధృవీకరణ పత్రం మంజూరు చేసేందుకు వీలు కల్పించేలా ఈ ఏడాది జూలైలో రూల్స్ మార్చబడ్డాయి. ఈ చర్య వల్ల వారు కేంద్రపాలిత ప్రాంతంలో భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయవచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జమ్మూకశ్మీర్ లో 15 ఏళ్లుగా నివసించిన, లేదా ఏడేళ్లపాటు చదివినా మరియు ఈ ప్రాంతంలోని ఒక విద్యాసంస్థలో 10 లేదా 12 వ తరగతి పరీక్షలో హాజరైన వారందరూ మరియు వారి పిల్లలు నివాస హోదా పొందేందుకు అర్హులు.

కనుమరుగైన జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక జెండా
: ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్ ప్రత్యేక జెండా ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఆర్టికల్ 370 రద్దు చేసిన వెంటనే శ్రీనగర్‌లోని సివిల్ సెక్రటేరియట్.. భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. అయితే రాష్ట్ర సొంత జెండా మాత్రం సచివాలయంపై లేదు. ఆరు దశాబ్దాలకు పైగా సచివాలయంలో భారత జాతీయ జెండా కశ్మీర్ ప్రత్యేక జెండా రెపరెపలాడిన విషయం తెలిసిందే.

రాళ్లు రువ్వేవారికి పాస్‌పోర్ట్ కోసం సెక్యూరిటీ క్లియరెన్స్ తొలగించబడింది: రాళ్లు రువ్వడం లేదా విద్రోహ కార్యకలాపాలలో పాల్గొన్న వారందరికీ పాస్‌పోర్ట్ మరియు ఇతర ప్రభుత్వ సేవలకు అవసరమైన సెక్యూరిటీ క్లియరెన్స్‌ను తిరస్కరించేలా జమ్మూ కాశ్మీర్ పోలీసు CID విభాగం ఆదేశాలు జారీ చేసింది. జూలై 31 న ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అదేవిధంగా, పాస్‌పోర్ట్ సేవ మరియు ప్రభుత్వ పథకాలకి సంబంధించిన ధృవీకరణ సమయంలో రాళ్ల దాడి కేసులు, రాష్ట్ర శాంతిభద్రతలకు హాని కలిగించే ఇతర నేరాలలో సంబంధిత వ్యక్తి ప్రమేయం ఉందా లేదా అనేది చూసుకోవాలని అన్ని రంగాలను ఆదేశాలివ్వబడ్డాయి.

గుప్కర్ కూటమి ఏర్పాటు
: ఆగస్టు 5 తెల్లవారుజామున.. కశ్మీర్ లో అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యగా ముగ్గురు మాజీ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రులు మొహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా మరియు ఫరూక్ అబ్దుల్లా సహా వందలాది మంది రాజకీయ నాయకులు మరియు పలు పార్టీల కార్యలను అధికారులు నిర్బంధించారు. ఒమర్ అబ్దుల్లా,ఫరూక్ అబ్దుల్లా 2020 మార్చిలో విడుదల చేయబడ్డారు. మొహబూబా ముఫ్తీ గత సంవత్సరం అక్టోబర్ రెండవ వారంలో విడుదలయ్యారు. అప్పటి నుండి కశ్మీర్ ప్రాంతీయ పార్టీల నాయకులందరూ కలిసి గుప్కర్ కూటమిగా ఏర్పడి..జమ్మూకశ్మీర్ యొక్క ప్రత్యేక హోదా పునరుద్ధరణ కోసం పని చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.