కరోనా వేళ..ఘనంగా పెళ్లి..ఇంకేముంది..43 మందికి కరోనా

  • Published By: madhu ,Published On : July 28, 2020 / 07:15 AM IST
కరోనా వేళ..ఘనంగా పెళ్లి..ఇంకేముంది..43 మందికి కరోనా

కరోన వైరస్ భారతదేశాన్ని గడగడలాడిస్తోంది. లక్షలాది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి తొలుత కేరళ రాష్ట్రంలో పాజిటివ్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. కానీ పకడ్బంది చర్యలు తీసుకోవడంతో వైరస్ ను కట్టడి చేయగలిగింది అక్కడి ప్రభుత్వం. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఇంకా కేసులు వెలుగు చూస్తున్నాయి.

వైరస్ ను నిలువరించేందుకు కఠినమైన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. అందులో వివాహ వేడుకలు ఒకటి. పెళ్లి నిర్వహించాలని అనుకుంటే..ప్రోటోకాల్స్ పాటించాలని, పరిమిత సంఖ్యలో ఈ వేడుకలు జరగాలనే నిబంధన విధించింది.

కానీ కాసర్ గడ్ జిల్లా చెంగల పంచాయతీ, పిల్లంకట్టలో కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి జులై 17వ తేదీన వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 125 మంది హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పెళ్లి కుమార్తె తండ్రిపై కేసు నమోదు చేశారు. పెళ్లికి హాజరైన వారికి పరీక్షలు నిర్వహించగా…ఏకంగా 43 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఇందులో వధూవరులు కూడా ఉన్నారు.

ఇటీవలే..వరుడు, అతని తండ్రి దుబాయికి వెళ్లివచ్చినట్లు గుర్తించారు. పాజిటివ్ ఉన్న వారందరూ..హోం క్వారంటైన్ కు వెళ్లాలని, లక్షణాలు ఉన్న వారు సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించాలని అధికారులు సూచించారు.

Kasaragod, Manjeshwaram, Hosdurg, Kumbala, and Nileshwaram పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజా రవాణాకు అనుమతించడం లేదు. కేరళ రాష్ట్రంలో ప్రతి రోజు 20 వేలకి పైగా..కోవిడ్ -19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమాన విధించే అవకాశం ఉంది.

వివాహ వేడుకలకు కేవలం 50 మంది మాత్రమే హాజరు కావాలని, భౌతిక దూరం పాటించాలనే నిబంధన ఉంది.