యూపీపై ఆప్ కన్ను… పంచాయితీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

  • Published By: venkaiahnaidu ,Published On : February 23, 2020 / 12:52 PM IST
యూపీపై ఆప్ కన్ను… పంచాయితీ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేజ్రీవాల్ మూడవసారి సీఎం అయ్యారు. అయితే మూడోసారి ఢిల్లీలో గ్రాండ్ విక్టరీ కొట్టి  మంచి ఊపులో ఉన్న ఆప్…ఇప్పుడు పక్కనున్నఉత్తరప్రదేశ్ పై కన్నేసింది. యూపీలో తన పార్టీని విస్తరించాలని ప్రణాళిక రచిస్తోంది.

దేశంలోనే జనాభా అధికంగా ఉండి మిని ఇండియాగా పిలవబడే ఉత్తరప్రదేశ్ తమ సత్తా చూపించాలని ఆప్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ లో పార్టీ సభ్యత కార్యక్రమాన్ని నిర్వహిస్తామని,రానున్న మూడు నెలల్లో ఉత్తరప్రదేశ్ లోని 1.07లక్షల గ్రామాల్లో ఆప్ కార్యకర్తలు పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారని,ప్రజలపై ప్రభావం చూపే విషయాలపై సమాచారం ఇస్తారని ఆప్ ప్రతినిధి,రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తెలిపారు. ఫిబ్రవరి-24,2020నుంచి మార్చి-22,2020వరకు సభ్యత నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 

మూడు నెలల తర్వాత మొత్తం ఫీడ్ బాక్ ను అరవింద్ కేజ్రీవాల్ కు సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే నెల రోజుల్లో 25లక్షల మందికి సభ్యతం దిశగా ఆప్ ప్రణాళికలు చేస్తుందని సంజయ్ సింగ్ తెలిపారు. ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 5వేల పార్టీ పోస్టర్లు ఉంచుతామని తెలిపారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న యూపీ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఆప్ పోటీ చేయనున్నట్లు సంజయ్ సింగ్ తెలిపారు.

బీజేపీ చెప్పుకునే గుజరాత్‌ మోడల్‌కు, ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి నమూనాలకు అసలు పొంతనే లేదని సంజయ్ సింగ్ అన్నారు. ఢిల్లీ చేస్తున్న అభివృద్ధి పనుల ఎజెండాతో యూపీలో క్షేత్రస్థాయిలో ఆప్‌ విస్తృతపరిచేందుకు ప్రణాళిక ప్రారంభించామన్నారు. 2022లో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆప్ పోటీ చేస్తుందని సింగ్ తెలిపారు. అభివృద్ధి ఎజెండాగానే 2022యూపీ ఎన్నికల్లో ఆప్ పోటీ చేస్తుందని,ఢిల్లీ డెవలప్ మెంట్ మోడల్ మీదే తాము ప్రజలను ఓటు వేయమని అడుగుతామని సింగ్ తెలిపారు.