Actor Sonu Sood : పన్నులు ఎగ్గొట్టి సోనూసూద్ విలన్‌గా మారారా ?

రీల్ నుంచి రియల్ హీరోగా మారిన సోనూసూద్‌ చుట్టూ ఇప్పుడు ఐటీ ఉచ్చు బిగుసుకొంటోంది. మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో అసలు అధికారులు ఏం తేల్చారు?

10TV Telugu News

Actor Sonu Sood : సినిమాల్లోని విలన్ కాస్తా.. కోవిడ్ టైంలో రియల్ హీరో అయిపోయాడు. దెబ్బకు.. ఇండియా మొత్తం పాపులర్ పర్సనాలిటీగా మారిపోయాడు… రీల్ నుంచి రియల్ హీరోగా మారిన సోనూసూద్‌ చుట్టూ ఇప్పుడు ఐటీ ఉచ్చు బిగుసుకొంటోంది. మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో అసలు అధికారులు ఏం తేల్చారు?

కోవిడ్‌ టైంలో తన దాతృత్వంతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్‌.. దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన బోగస్‌ లావాదేవీలు జరపడంతో పాటు.. 20 కోట్ల పన్నును ఎగ్గొట్టినట్టు తేల్చింది ఆదాయపన్ను శాఖ. సోనూసూద్‌ ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా 3 రోజుల పాటు.. 28 చోట్ల తనిఖీలు నిర్వహించిన ఇన్‌కమ్‌ టాక్స్ అధికారులు 20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు తేల్చారు.. పన్ను ఎగవేత కోసమే బోగస్ లావాదేవీలు నిర్వహించినట్టు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్ టాక్స్‌ గుర్తించింది.. అదే సమయంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల 10 లక్షల విరాళాలు సేకరించినట్లు తేల్చారు అధికారులు.
Also Read : Raj Kundra Case : యూజర్ల కోసం, డబ్బు సంపాదనే లక్ష్యంగా అశ్లీల చిత్రాలను తీయాలనుకున్నాడు

అయితే ఎక్కడా కూడా సోనూసూద్‌ పేరును కానీ, అతని కంపెనీ అని కానీ స్టేట్‌మెంట్ ఇవ్వలేదు సీబీడీటీ.. మూడు రోజుల పాటు ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ, గురుగ్రామ్‌ సహా.. మొత్తం 28 చోట్ల తనిఖీలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలతో.. ఐటీ శాఖ అధికారులు సోనూసూద్‌తో పాటు అతని సహచరుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. వారి ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. మొత్తం 200 కోట్ల రూపాయల వరకూ బోగస్ లావాదేవీలు జరిగినట్లు తేల్చారు. లెక్కల్లో చూపని ఆదాయాన్ని సోనూసూద్‌.. 20 బోగస్‌ కంపెనీలకు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఈ సంస్థలను ఏర్పాటు చేసిన వ్యక్తులు.. సోనూసూద్‌ నుంచి నగదు తీసుకుని.. చెక్కులు ఇచ్చినట్లు తేల్చారు.

సోనూ సూద్‌ వృత్తిపరంగా వచ్చిన ఆదాయాన్ని సైతం.. రుణాలుగా మార్చి చూపించిన ఉదంతాలు కూడా ఉన్నాయంటున్నారు అధికారులు. ఇలా రుణాల రూపంలో తీసుకున్నట్లుగా చూపించిన డబ్బును సోనూసూద్‌.. పెట్టుబడిగా పెట్టి ఆస్తులు కూడబెట్టినట్లు CBDT దర్యాప్తులో బయటపడింది. డబ్బును.. సోనూసూద్ బోగస్ సంస్థల నుంచి తీసుకున్నట్లుగా అకౌంట్స్‌లో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌ చెబుతోంది.
Also Read : Chiranjeevi : సాయి పల్లవిని మెగాస్టార్ మామూలుగా ఏడిపించలేదుగా..!

అలాగే విదేశీ విరాళాలకు సంబంధించి.. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌ను కూడా సోనూసూద్ ఉల్లంఘించారని అధికారులు చెబుతున్నారు. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫామ్ ద్వారా.. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ దాతల నుంచి 2 కోట్ల 10 లక్షల విరాళాలు సేకరించినట్లు CBDT చెబుతోంది.

ఇదిలా ఉంటే.. లక్నోకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థతో జాయింట్ వెంచర్ డెవలప్ చేసేందుకు సోనూసూద్ చేతులు కలిపారు. ఆ సంస్థతో కలిసి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టారు. వీటి ద్వారానే.. పన్ను ఎగవేత, అక్రమ లావాదేవీలకు సంబంధించి సాక్ష్యాలు దొరికాయి. లక్నో సంస్థ సబ్‌ కాంట్రక్టులు ఇచ్చినట్లు బోగస్‌ బిల్లులు సృష్టించి నిధులను దారి మళ్లించింది. ఇలా ఏకంగా 65 కోట్లకు పైగా నిధులు మళ్లించారంటోంది. ఈ సంస్థలో కోటీ 80 లక్షల నగదును సీజ్ చేశారు. అదే సమయంలో 11 లాకర్లను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అంతేకాదు.. జైపూర్‌కు చెందిన ఓ మౌలిక సదుపాయాల కంపెనీకి లక్నో సంస్థకు మధ్య 175 కోట్ల రూపాయల బోగస్‌ లావాదేవీలు జరిగినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌ దర్యాప్తులో బయటపడింది.

అంతేగాకుండా కోవిడ్ ఫస్ట్ వేవ్ టైంలో.. గతేడాది జులైలో ఆయన ఏర్పాటు చేసిన సూద్ చారిటీ ఫౌండేషన్‌కు ఈ ఏప్రిల్ నాటికి 18 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు ఐటీ అధికారులు లెక్క తేల్చారు. అందులో కేవలం కోటి 90 లక్షలను మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని.. మిగతా డబ్బంతా చారిటీ ఫౌండేషన్ ఖాతాలోనే ఉందని చెబుతున్నారు.

10TV Telugu News