కరోనా భయం…మార్చి-31వరకు పాఠశాలలకు సెలవులు

  • Published By: venkaiahnaidu ,Published On : March 5, 2020 / 01:26 PM IST
కరోనా భయం…మార్చి-31వరకు పాఠశాలలకు సెలవులు

ఇప్పటివరకు వ్యాక్సిన్ లేని కరోనా వైరస్‌ దెబ్బకు ప్రపంచంలోని అన్ని దేశాలు భయపడుతున్నాయి. భారత్ లో కూడా ఇప్పటికే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా పేరు వింటేనే ఇప్పుడు ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారంట. దేశ రాజధాని అయిన ఢిల్లీకి నిత్యం వివిధ దేశాల నుంచి ప్రతినిధులు, పర్యాటకులువస్తుండటంతో.. వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రైమరీ స్కూల్స్ కు (1-5వ తరగతి)మార్చి 30 వరకు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వర్తిస్తాయని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా గురువారం ట్విటర్‌ ద్వారా తెలిపారు. అయితే ఈ సెలవులు కేవళం ప్రైమరీ స్కూల్స్ కు మాత్రమేనని,సెకండరీ స్కూల్స్ కు కాదని ఆయన తెలిపారు.

మరోవైపు విద్యార్థులకు పరీక్షల సమయం కావడంతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెంకడరీ ఎడ్యూకేషన్‌ (CBSE) విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పరిమితమైన వెసులుబాటును కల్పించింది. పరీక్షలుకు హాజరైయ్యే విద్యార్థులు ముఖాలకు మాస్క్‌లు ధరించవచ్చని ప్రకటించింది. మరోవైపు పోర్ట్ లు, ఎయిర్ పోర్ట్ లలో ఇతర దేశాల నుంచి వస్తున్న వారికి ప్రత్యేక పరీక్షలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రధానమం‍త్రి నరంద్రే మోడీ బ్రసెల్స్ పర్యటన కూడా రద్దయింది.