రైతులతో చర్చలకు కొద్దిగంటల ముందు వ్యవసాయ మంత్రి కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 2, 2020 / 08:38 PM IST
రైతులతో చర్చలకు కొద్దిగంటల ముందు వ్యవసాయ మంత్రి కీలక వ్యాఖ్యలు

Agriculture Minister’s BIG remark దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులతో గురువారం(డిసెంబర్-3,2020)మరోసారి చర్చలు జరుపనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా దేశ రాజధానిలో రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం(డిసెంబర్-1,2020)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిపిన చర్చలు ఓ కొలిక్కిరాకపోవడంతో గురువారం మరోమారు రైతు నాయకులతో కేంద్రం చర్చలు జరుపనుంది.



అయితే,రైతులతో చర్చలకు కొద్ది గంటల ముందు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు లేవనెత్తుతున్న డిమాండ్లలో కొన్ని ప్రధానమైనవాటిని నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైనట్లు సూత్రప్రాయంగా తెలిపారు. రైతులు లేవనెత్తిన వివాదాస్పద సమస్యలను బహిరంగంగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బుధవారం ఓ ఇంటర్వ్యూలో తోమర్ తెలిపారు.



నూతన వ్యవసాయ చట్టాలు తమకు హాని కలిగిస్తాయనే భ్రమలో రైతులు ఉన్నారని తోమర్ తెలిపారు. రైతులను ఓప్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. కనీస మద్దతు ధర(MSP) కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీనే ఈ విషయాన్ని స్వయంగా చెప్పారని, ఈ విషయమై రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.



అయితే కనీస మద్దుత ధర చట్టబద్ధతపై మాట్లాడుతూ…గతంలో కూడా MSP ఎప్పుడూ చట్టంలో భాగంగా లేదని,ప్రతి ఒక్క రైతూ కనీస మద్దతు ధర కింద లబ్ది పొందేలా భరోసా కల్పించడం ప్రభుత్వపై ప్రియారిటీ అని తోమర్ పేర్కొన్నారు. అయితే చట్టంకి సంబంధించి..తొందరపాటుగా కొత్త అగ్రి చట్టాలను కేంద్రం తీసుకురాలేదని తెలిపారు. మూడు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చే ముందే వీటికి సంబంధించి పెద్ద కసరత్తు జరిగిందని తోమర్ తెలిపారు.



మరోవైపు,నూతన అగ్రి చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు పట్టుబడుతున్నారు. అగ్రి చట్టాలు రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. కొత్త అగ్రి చట్టాలు ఉపసంహరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తున్నామని క్రాంతికారి కిసాన్ యూనియన్ అధ్యక్షుడు దర్శన్ పాల్ పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వానికి మరియు కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా డిసెంబర్-5 దేశవ్యాప్తంగా దిష్ఠిబొమ్మల దగ్థంకి పిలుపునివ్వబోతున్నట్లు తెలిపారు.