భారత్ “నూతన సాగు చట్టాలు”ను సమర్థించిన అమెరికా

భారత్ “నూతన సాగు చట్టాలు”ను సమర్థించిన అమెరికా

US welcomes భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు అమెరికా మద్దతు తెలిపింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు భారత్‌ చేపట్టిన చర్యల వల్ల ఇండియన్ మార్కెట్‌ విస్తరిస్తుందని, ప్రైవేట్ రంగం నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి వీలు కలుగుతుందని యూఎస్ అభిప్రాయపడింది.ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు పర్యావరణ ఉద్యమకర్త గ్రెటా థన్‌‌బర్గ్, పాప్ స్టార్ రిహన్నా లాంటి కొందరు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనపై అంతర్జాతీయ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వానికి యూఎస్ మద్దతుగా నిలిచింది.

భారత్‌లో జరుగుతున్న రైతుల ఆందోళనపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ..భారత మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచేలా, ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించేలా ఆ దేశ ప్రభుత్వం చేపట్టే చర్యలను అమెరికా స్వాగతిస్తోంది. వ్యవసాయ రంగంలో భారత తీసుకొస్తున్న సంస్కరణల వల్ల అక్కడి రైతులకు మార్కెట్‌ పరిధి పెరుగుతుంది. శాంతియుత నిరసనలు అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యానికి ముఖ్య లక్షణం. భారత సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది. కానీ ఎలాంటి విభేదాలనైనా చర్చలతోనే పరిష్కరించుకోవాలని అమెరికా ప్రోత్సహిస్తుంది అని తెలిపారు.

ఇక, పలువురు అమెరికా ప్రజాప్రతినిధులు రైతుల ఉద్యమానికి మద్దుతు తెలియజేశారు. భారతదేశంలో కొత్త వ్యవసాయ సంస్కరణ చట్టాలను నిరసిస్తూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారిపై తీసుకున్న చర్యల గురించి నేను ఆందోళన చెందుతున్నాను అని యూఎస్ కాంగ్రెస్(పార్లమెంట్)సభ్యురాలు హాలే స్టీవెన్స్ అన్నారు. భారత ప్రభుత్వం, రైతు సంఘాలు ప్రతినిధులు చర్చలు ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరో సభ్యురాలు ఇల్హాన్‌ ఓమర్‌ స్పందిస్తూ.. ఆందోళన చేస్తున్న రైతులకు ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులు కల్పించాలి. వారికి ఇంటర్నెట్‌ సేవలను పునరుద్ధరించాలి. ఆందోళనల నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను విడుదల చేయాలని అని ట్వీటర్‌లో కోరారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ బంధువు మీనా హారిస్‌ స్పందిస్తూ.. రైతులపై ప్రభుత్వం చర్యలు బాధాకరమని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం నేడు దాడులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.