Yes Or No మాత్రమే…రైతు లీడర్లతో అమిత్ షా భేటీ

  • Published By: venkaiahnaidu ,Published On : December 8, 2020 / 10:57 PM IST
Yes Or No మాత్రమే…రైతు లీడర్లతో అమిత్ షా భేటీ

Amit Shah Meets Farmer Groups రైతుల భారత్ బంద్ తో కేంద్రం ఒక మెట్టు దిగొచ్చింది.నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తోన్న ఆందోళనలు విరమింపచేసేందుకు రైతు లీడర్లతో బుధవారం(డిసెంబర్-9,2020) ఆరో దశ చర్చలకు కేంద్రం సిద్దమైన నేపథ్యంలో చర్చలకు కొద్ది గంటలముందు మంగళవారం సాయంత్రం రైతు నాయకులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు.



ఢిల్లీలోని పూసా అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్ క్యాంపస్ లో ఈ మీటింగ్ జరిగింది. మొదట అమిత్ షా అధికారిక నివాసంలో మీటింగ్ జరగాల్సింది షెడ్యూల్ చేయబడినప్పటికీ తర్వాత మీటింగ్ ప్లేస్ ను పూసా అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్ క్యాంపస్ కి మార్చారు. 13 మంది రైతు నాయకులు అమిత్ షాతో మీటింగ్ కి హాజరయ్యారు.

కాగా,అమిత్ షా తో మీటింగ్ కి బయలుదేరే ముందు రైతు నాయకుడు రుద్రు సింగ్ మన్సా మాట్లాడుతూ..చట్టాల రద్దుపైనే ప్రధానంగా తమ గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. నేటి సమావేశంలో హోంమంత్రి నుండి ‘అవును’ లేదా ‘కాదు’ అనే సమాధానం కోసం మేము డిమాండ్ చేస్తాము అని తెలిపారు.



కాగా,వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నేడు(డిసెంబర్-8) రైతులు దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్‌ బంద్‌‌ విజయవంతంగా ముగిసింది. ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, ట్రికీ రహదారుల్లో వేలాది మంది బైఠాయించి శాంతియుతంగా ఆందోళన చేశారు. మార్కెట్లన్నీ మూతబడ్డాయి. దుకాణాలు మూసివేశారు. పలు రాజకీయ పార్టీలు కూడా భారత్ బంద్ కు మద్దతు తెలిపాయి. దేశంలో పలు చోట్ల రైలు, రవాణా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.



మరోవైపు,బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చే అవకాశమున్నట్లు సమాచారం. ఆందోళనలను సాధ్యమైనంత త్వరగా చల్లార్చాలని కేంద్రం భావిస్తోంది. అదే సమయంలో బుధవారం సాయంత్రం సాయంత్రం 5 గంటలకు ఐదుగురు విపక్ష పార్టీల ప్రతినిధులు వ్యవసాయ చట్టాల విషయమై రాష్ట్రపతిని కలవనున్నారు.