Delhi TTD Temple : ఢిల్లీలో మే 3 నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు
ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌లో టీటీడీ సమాచార కేంద్రం కొవిడ్ కారణంగా తీసేశామని, టీటీడీ చైర్మన్, ఈవోతో మాట్లాడి మళ్లీ పునరుద్ధరించే ఏర్పాటు చేస్తామని ఢిల్లీ ఎల్ఏసీ చైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు.

Delhi TTD Balaji Temple
Delhi TTD Temple : న్యూ ఢిల్లీలోని గోల్ మార్కెట్ వద్ద టీటీడీ ఆలయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయని ఢిల్లీ ఎల్ఏసీ చైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 3న అంకురార్పణతో ప్రారంభమై, మే 13న పుష్పయాగంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మే 8న స్వామి వారి కళ్యాణం కూడా ఉంటుందని, భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఆలయంలో లడ్డు కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు భవన్‌లలో సమాచార కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చెప్పారు.
YS Sharmila: నీ దగ్గర అవినీతి ఎమ్మెల్యేల చిట్టా ఉన్నా.. చర్యలెందుకు తీసుకోవడం లేదు కేసీఆర్?
బ్రహ్మోత్సవాల్లో భాగంగా వాహన సేవలు కూడా ఉన్నాయని అన్నారు. ‘చక్రస్నానం’ యమున ఘాట్‌లో జరుగుతుందని, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరుతున్నామని తెలిపారు. యాగశాల నిర్మాణం పూర్తయిందని, మే 8న ప్రారంభిస్తామని ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో వెంకటేశ్వర స్వామి కార్యక్రమాలకే పరిమితం చేయమని సూచించారు, అందుకే ఇదివరకటిలా ఇతర ఆలయాల కార్యక్రమాలు చేపట్టడం లేదని చెప్పారు. ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్‌లో టీటీడీ సమాచార కేంద్రం కొవిడ్ కారణంగా తీసేశామని, టీటీడీ చైర్మన్, ఈవోతో మాట్లాడి మళ్లీ పునరుద్ధరించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. జమ్ములో టీటీడీ ఆలయ నిర్మాణం జూన్ నాటికి పూర్తవుతుంది. జూన్ 3 నుంచి 6 మధ్యలో ప్రారంభం ఉంటుంది. జమ్ము టీటీడీ ఆలయంలో జూన్ 3న కుంభాభిషేకంతో మొదలై 8న విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు.
బ్రహ్మోత్సవాల వివరాలు..
♦ మే 3న సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాల అంకురార్పణం.
♦ మే 4వ తేదీ ఉదయం 8.30 నుండి 9.30 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం.
♦ బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు వాహన సేవలు.
♦ మే 13వ తేదీన సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహణ
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ..
♦ 04-05-2023 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – పెద్దశేష వాహనం.
♦ 05-05-2023 ఉదయం – చిన్నశేష వాహనం, రాత్రి – హంస వాహనం.
♦ 06-05-2023 ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనం.
♦ 07-05-2023 ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనం.
♦ 08-05-2023 ఉదయం – మోహినీ అవతారం, సాయంత్రం – కల్యాణోత్సవం, రాత్రి – గరుడ వాహనం.
♦ 09-05-2023 ఉదయం – హనుమంత వాహనం, రాత్రి – గజవాహనం.
♦ 10-05-2023 ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం.
♦ 11-05-2023 ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వ వాహనం.
♦ 12-05-2023 ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.
♦ మే 13న పుష్పయాగంతో ముగియనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.