ముగ్గురు పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు 

  • Published By: veegamteam ,Published On : October 22, 2019 / 11:14 AM IST
ముగ్గురు పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు 

ఉద్యోగాల విషయంలో అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇద్దరు పిల్లలకు మించి  ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని అసోం పరిశ్రమల శాఖామంత్రి చంద్రమోహన్‌ పట్వారీ అన్నారు. ఒక్కరు లేదా ఇద్దరు సంతానం కలిగి ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనీ..అంతకు మించి ఉన్నవారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులని అన్నారు. 

సోమవారం (అక్టోబర్‌ 21) జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని మంత్రి పట్వారీ  తెలిపారు. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం కలిగిన వారు కనీసం ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు కూడా చేసుకోవడానికి వీల్లేదని ఆయన స్పష్టంచేశారు. ఈ రూల్ జనవరి 1, 2021 నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.

దీనికి సంబంధించి సీఎం కార్యాలయం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. 2021 జనవరి నుండి, ఇద్దరు పిల్లలకు పైగా ఉన్న తల్లిదండ్రులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబడవని దానిలో పేర్కొంది. ఈ ప్రకటనలో కొత్త భూ విధానం గురించి కూడా పొందుపరిచారు. భూమి లేని వారు వ్యవసాయం చేసుకోవటానికి..ఇళ్లు లేనివారి కోసం భూమి ప్రభుత్వం ఇస్తుందని తెలిపింది. పెరుగుతున్న జనాభాను నియంత్రించటానికి అసోం ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.