షాకింగ్ వీడియో: మెరుపు వేగంతో జింకను వేటాడిన కొండచిలువ

  • Published By: sreehari ,Published On : November 26, 2019 / 07:45 AM IST
షాకింగ్ వీడియో: మెరుపు వేగంతో జింకను వేటాడిన కొండచిలువ

కాకులు దూరని కారడవి. చీమలు దూరని చిట్టడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులు నివసిస్తున్నాయి. ఎప్పటిలానే దాహం తీర్చుకునేందుకు నీటి మడుగు దగ్గరకు వెళ్లాయి. నీళ్లు తాగే సమయంలో క్రూర జంతువులు వేటాడటం సహజమే. సాధారణంగా ఏ పులి, సింహామో జింకలను వేటాడటం జియోగ్రాఫిక్ టీవీ ఛానళ్లలో చూసి ఉంటాం. ఆకలితో అలమటిస్తున్న ఓ కొండచిలువ నీటి మడుగు చాటున నక్కింది. వేటాడేందుకు ఏ జంతువు దగ్గరకు వస్తుందా? అని మాటు వేసింది.

ఇంతలో దాహం తీర్చుకునేందుకు నాలుగు జింక పిల్లలు నీటి మడుగు దగ్గరకు వచ్చాయి. మృత్యువు కబళించబోతుందని పాపం వాటికి తెలియదు. ఒక జింక నీరు తాగేందుకు తల వంచగానే మెరుపు వేగంతో నీటిలో నుంచి కొండచిలువ పైఎగిరింది. అమాంతం జింక మెడను నోట కరిచింది. అంతే.. కొండచిలువ దెబ్బకు జింక విలవిలలాడిపోయింది.

ఈ ఘటన మహారాష్ట్రలోని సెంట్రల్ చంద్ర డివిజన్ లో జరిగింది. కొండచిలువ పైఎగిరి జింకపై దాడి చేసిన వేగం 50 మిల్లీ సెకన్లు మాత్రమే. అంటే.. మనుషుల్లో ఒక రెప్పపాటుకు 200మిల్లీసెకన్ల సమయం పడుతుంది. అంతకంటే తక్కువ వ్యవధిలోనే మిల్లీ సెకన్లలో కొండచిలువ జింకను వేటాడింది.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంతా నందా ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ఇప్పటివరకూ వీడియోకు 16వేల వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు ఓ మైగాడ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..