మాస్కులను కడిగి లేదా ఉతికి మళ్లీ వాడుకోవచ్చా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

  • Published By: naveen ,Published On : July 22, 2020 / 08:33 AM IST
మాస్కులను కడిగి లేదా ఉతికి మళ్లీ వాడుకోవచ్చా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి భౌతికదూరం పాటించడం. మరొకటి మాస్కుల వినియోగం. కరోనా వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ రెండూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని నిపుణులు చెప్పారు. మాస్కులు, కొంతవరకు కరోనా వైరస్ కణాల బారి నుంచి కాపాడతాయని అందరూ నమ్ముతున్నారు. అందుకే రకరకాల మాస్కులు వాడుతున్నారు. మరీ ముఖ్యంగా ఎన్-95 మాస్క్ అయితే ఫుల్ సేఫ్టీ అనే ప్రచారంతో అందరూ వాటినే వినియోగిస్తున్నారు. ధర ఎక్కువైనా వాటినే కొంటున్నారు.

ఎన్-95 మాస్కులతో కరోనా సోకే ప్రమాదం:
కాగా, వాల్వ్‌డ్(కవాటం) రెస్పిరేటర్ ఉన్న ఎన్-95 మాస్కులతో ప్రయోజనం లేదని, అవి మాస్క్ నుంచి వైరస్ బయటికి వెళ్ళటాన్ని నిరోధించజాలవని, అందువల్ల ఇవి హానికరమని, వాటిని ధరించవద్దని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు చేపడుతున్న చర్యలకు వాల్వ్‌డ్(కవాటం) రెస్పిరేటర్ ఉన్న ఎన్-95 మాస్కు హాని కలిగిస్తుందన్నారు. వీటిని సరికాని రీతిలో వాడటాన్ని నిరోధించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్రం ఇలా చెప్పడంతో జనాలు షాక్ అయ్యారు. ఎన్ 95 మాస్కు ధరించాము, ఇక మాకు భయం లేదు, కరోనా సోకదు అని ధీమాగా ఉన్నవారంతా కంగుతిన్నారు.

ఎన్-95 మాస్కుల గురించి సందేహాలు:
తాజాగా ఎన్-95 మాస్కుల గురించి మరో ధర్మ సందేహం వచ్చింది. అదేంటంటే, మాస్కులను కడిగి లేదా ఉతికి మళ్లీ వాడుకోవచ్చా? సర్జికల్, ఎన్ 95 మాస్కుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ని రోజులు వాడాలి? ఎన్ని గంటలు వాడాలి? అనే సందేహాలు ఉత్పన్నమయ్యాయి. దీనికి నిపుణులు ఏమన్నారంటే..

కడిగి లేదా ఉతికి వాడకూడదు:
సర్జికల్, ఎన్-95 మాస్కులను ఉతికి లేదా కడిగి వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు. క్లాత్ మాస్కులైతే 6 గంటలకు ఒకటి మారుస్తూ ఉతికి వాడుకోవచ్చని చెబుతున్నారు. ఎన్ 95 మాస్కులు ధరించే వారు ఐదు మాస్కులను సిద్ధం చేసుకుని, ఒక్కో మాస్కు ఒక్కో రోజు ధరించాలన్నారు. అలా 5 మాస్కులు 5 రోజులు ధరించాక, మొదటి రోజు వేసుకున్న మాస్కును మళ్లీ పెట్టుకోవాలన్నారు. ఇలా ఒక్కో మాస్కును 5 సార్లు వాడి, ఆ తర్వాత పడేయాలన్నారు.