కేంద్ర బడ్జెట్ : వేతన జీవుల ఆశలు, పన్ను రాయితీలపై భారీ ఆశలు

కేంద్ర బడ్జెట్ : వేతన జీవుల ఆశలు, పన్ను రాయితీలపై భారీ ఆశలు

Central Budget 2021-22 : బడ్జెట్ వస్తోందంటే అందరి కళ్లూ అటే ఉంటాయి. ఏం పెరుగుతుంది… ఏం తగ్గుతుంది.. అనే లెక్కలేసుకుంటారు అందరూ. అయితే.. సగటు వేతన జీవి మాత్రం పన్ను రాయితీ ఉంటుందా… ఈసారి శ్లాబుల్లో ఏమైనా మార్పులుంటాయా… అన్నది మాత్రమే చూస్తాడు. మరి ఈసారి బడ్జెట్‌లోనైనా సగటుజీవి విన్నపాల్ని వింటారా…? లేక ఎప్పట్లానే పక్కకు నెట్టేస్తారా…? ఎప్పుడూ చూడని బడ్జెట్.. స్మార్ట్ బడ్జెట్ అంటూ కేంద్రం చేస్తున్న ప్రకటనలు.. సామాన్యులను ఊరిస్తున్నాయి. ఏటా ఐటీ చెల్లించే వేతన జీవులే ఎక్కువగా సామాన్యుల వర్గంలో ఉంటారు. చిన్న చిన్న రాయితీల పైనే వారి ఆశలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయపు పన్ను, ఆరోగ్య బీమా, గృహ రుణాల చెల్లింపుపై రాయితీలాంటి వాటిపై అంచనాలు పెంచుకుంటుంటారు. కరోనా కారణంగా వేతనాలు తగ్గడం, ఉద్యోగాలు పోవడంతో… బడ్జెట్ రాయితీలు ఉపశమనం కలిగించేలా ఉండాలని జనాలు ఆశిస్తున్నారు.

నిపుణుల అంచనా : –
దేశంలో భారీ ఎత్తున వినియోగాన్ని ప్రోత్సహించేలా.. ప్రజల చేతుల్లో నగదు ఎక్కువ ఉండేలా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-22 బడ్జెట్‌ను పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను భారంలో 50 వేల నుంచి 80 వేల వరకూ రాయితీ కల్పించే అవకాశాలున్నాయని, స్టాండర్డ్‌ డిడక్షన్‌ను లక్ష వరకు పెంచే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. పన్ను విధించే ఆదాయం పరిధి పెంచే అవకాశాలు కూడా ఉన్నట్టు ఆశిస్తున్నారు.

సెక్షన్ 80 సి: –
గతేడాది ఆదాయపు పన్ను విధానంలో కేంద్రం మార్పులు తీసుకొచ్చింది. కొత్త పన్ను విధానాన్ని కూడా ఆప్షన్‌గా ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులు దేనిలో ఎక్కువ లబ్ధి ఉంటే దానిని ఎన్నుకున్నారు. కానీ.. అది తక్కువ మొత్తంలోనే లబ్ధిని కలిగించింది. ఇప్పుడలాంటి సిచ్యుయేషన్ లేదు. వివిధ రకాల పెట్టుబడుల ద్వారా వచ్చే సెక్షన్‌ 80సీ మొత్తాన్ని 1.5లక్షల నుంచి మరింత పెంచాలని వేతన జీవి కోరుకుంటున్నాడు. దీన్ని సవరించి కూడా చాలా ఏళ్లవుతోంది. కాబట్టి… 2.5 లక్షల నుంచి 3లక్షలకు పెంచాలని కోరుతున్నారు. లేకపోతే ఆదాయాన్ని బట్టి సెక్షన్‌ 80సీ పరిధి వర్తించేలా చూడాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే… బీమాలో టర్మ్‌ ప్లాన్లు తీసుకోవడాన్ని ప్రోత్సహించేలా సెక్షన్‌ 80సీలో మార్పులు చేయాలనే సూచనలు కూడా వస్తున్నాయి.

సెక్షన్ 24బీ : –
ఇవే కాకుండా… ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 24 ప్రకారం ఇల్లు కొనుగోలు చేసినవారికి గృహ రుణ వడ్డీపై 2 లక్షల వరకు చేసే చెల్లింపులపై పన్ను లేదు. కేంద్ర ప్రభుత్వం దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే.. తొలిసారి ఇల్లు కొనుక్కునేవారికి అదనపు ప్రయోజనాలు ప్రకటిస్తారని అంచనాలున్నాయి. గృహ రుణాలపై మూలమొత్తం చెల్లింపులో ఇచ్చే రాయితీని 1.5 లక్షల నుంచి 2.5లక్షలకు పెంచాలని కోరుకుంటున్నారు. రియల్ ఎస్టేట్‌ రంగానికి కూడా మరింత ఊతం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెక్షన్‌ 24బీ కింద పన్ను పరిధిలోని ఆదాయ తగ్గింపు 5లక్షలకు పెంచాలని కోరుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.

ఆత్మనిర్భర్ భారత్ : –
సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ, పింఛన్లే ప్రధాన జీవనాధారం. వారికి వచ్చే వడ్డీలో ఎక్కువ మొత్తం పన్ను పరిధిలోకి రాకుండా ఆర్థిక మంత్రి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సెక్షన్‌ 8 టీటీబీ కింద 50వేల వడ్డీ ఆదాయం వరకు పన్నులేదు. కానీ… మినహాయింపును కనీసం లక్ష నుంచి 1.5లక్ష వరకు పెంచాలని కోరుకుంటున్నారు. కరోనా కారణంగా.. ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది వాస్తవమే అయినా… ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. ఆర్బీఐ అంచనాల ప్రకారం.. 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జిడిపి 24 శాతం తగ్గింది. రెండవ త్రైమాసికంలో కాస్త కోలుకుని అది 7.5 శాతం తగ్గింది. కరోనా దెబ్బతో వ్యక్తులు, కొన్ని రంగాల సంస్థల ఆదాయాలు తగ్గాయి. దీనివల్ల 2021-22లో పన్ను చెల్లింపులు తగ్గే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో.. పన్ను పరంగా మరిన్ని వెసులుబాట్లు కల్పించేందుకు ఆర్థిక మంత్రి ముందడుగేస్తారా.. ఆత్మనిర్భర్‌ భారత్‌ను మరింత ముందుకు తీసుకెళుతున్న ఈ సమయంలో కొంత పన్ను ఆదాయం కోల్పోడానికి సిద్ధమవుతారా తెలియాలంటే పద్దు పార్లమెంట్‌ ముందుకు వచ్చే వరకూ ఆగాల్సిందే.