అమ్మేయడమా? మూసెయ్యడమా? రెండే మార్గాలు.. : కేంద్రమంత్రి

అమ్మేయడమా? మూసెయ్యడమా? రెండే మార్గాలు.. : కేంద్రమంత్రి

Choice Between Selling Off And Shutting Down Aviation Minister Hardeep Puri

ఎయిరిండియాలో 100శాతం పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది కేంద్రప్రభుత్వం. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి. ఎయిరిండియాలో పెట్టుబడులు ఉంచాలా? లేదా అనేది ఛాయిస్ అని అన్నారు. పెట్టుబడులు పూర్తిగా వెనక్కి తీసుకోవాలా లేక సంస్థను మూసివేయాలా అన్నది మా దగ్గర ఉన్న రెండు మార్గాలు అని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి .

ఆస్తులపరంగా ఎయిరిండియాకు 60 వేల కోట్ల అప్పులు ఉన్నాయని, ఆ రుణ భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హర్దీప్ సింగ్ చెప్పారు. 64 రోజులలోపు బిడ్లు దాఖలు చేయాలని షార్ట్ లిస్ట్ చేసిన బిడ్డర్లకు తెలియజేయాలని నిర్ణయించినట్లు హర్దీప్ సింగ్ వెల్లడించారు. ఈసారి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నదని, పెట్టుబడుల ఉపసంహరణలో సంకోచాలు లేవని స్పష్టం చేశారు.

ఎయిరిండియా ప్రైవేటీకరణ ప్రక్రియ మే చివరి నాటికి పూర్తవుతుందని హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఎయిరిండియాను ప్రైవేటీకరించడం లేదా మూసివేయడం ప్రభుత్వానికి ముందు ఉన్న ఏకైక ఆప్షన్ అని హర్దీప్ సింగ్ చెప్పారు. ఎయిరిండియా డబ్బు సంపాదిస్తోందని, కానీ రోజుకు 20 కోట్ల రూపాయల నష్టం వస్తుందని అన్నారు. మిస్ మేనేజ్మెంట్ కారణంగా ఎయిరిండియా అప్పు రూ. 60వేల కోట్లకు చేరుకుందని అన్నారు.

స్పైస్‌జెట్‌ ప్రమోటర్‌ అయిన అజయ్‌సింగ్‌ ఎలాగైనా ఎయిరిండియాను సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఎయిరిండియాలో 100శాతం వాటాను సొంతం చేసుకునేందుకు రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీతోపాటు ఢిల్లీకి చెందిన బర్డ్‌ గ్రూపు ప్రమోటర్‌ అంకుర్‌ భాటియాతో జతకట్టారు.