Congress: “కర్ణాటక” వ్యూహంతో తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో గెలవాలని కాంగ్రెస్ నిర్ణయం.. ఇవి ప్రకటించే అవకాశం..

ఓ రాష్ట్రంలో గెలిచాక మరో రాష్ట్రంపై దృష్టి. కాంగ్రెస్ మహా సముద్రంలో మరిన్ని రాష్ట్రాలు...?

Congress: “కర్ణాటక” వ్యూహంతో తెలంగాణ సహా ఈ రాష్ట్రాల్లో గెలవాలని కాంగ్రెస్ నిర్ణయం.. ఇవి ప్రకటించే అవకాశం..

Congress

Karnataka template: స్థానిక వ్యూహాలు, గెలుస్తామనే సానుకూల దృక్పథంతో ప్రచారం, ఉచితాల ప్రకటన వంటి అంశాలతో కర్ణాటకలో ఎవరూ ఊహించని రీతిలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ (Congress).. ఇప్పుడు తదుపరి ఎన్నికలపై దృష్టి పెడుతోంది.

కర్ణాటకలో అనుచరించిన ఆ వ్యూహాలనే మరికొన్ని నెలల్లో వచ్చే తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే ఏపీ ఎన్నికలు ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో అనుసరించాలని ప్రణాళికలు వేసుకుంటోంది. నిజానికి 2014 ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీని మహా సముద్రం వంటిదని అనేవారు. మళ్లీ పూర్వవైభవాన్ని సాధించాలంటే ఇటీవల కర్ణాటకలో అనుసరించాల్సిన వ్యూహాన్నే వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఓ రాష్ట్రంలో గెలిచాక మరో రాష్ట్రంపై..

ప్రధాని మోదీ-కేంద్ర మంత్రి అమిత్ షా 2014 నుంచి ఓ వ్యూహాన్ని అనుసరిస్తూ వచ్చారు. ఓ రాష్ట్రంలో గెలిచిన వెంటనే మరో రాష్ట్రంపై దృష్టిపెట్టేవారు. గెలిచిన రాష్ట్రంలో అనుసరించిన వ్యూహాన్నే మరో రాష్ట్రంలో కొనసాగించి 2014 నుంచి ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించారు. ఇప్పుడు అటువంటి వ్యూహాన్నే కాంగ్రెస్ కూడా అనుసరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది తెలంగాణ ఎన్నికలే కాదు.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు కూడా జరగనున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం బీఆర్ఎస్, మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లో కాంగ్రెస్ సర్కారు ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలుపుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావాలని, ఆ రెండు రాష్ట్రాల్లో కాస్త కష్టపడితే కర్ణాటక ఫలితాలే పునరావృతం అవుతాయని భావిస్తున్నట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ 2018 ఎన్నికల్లో గెలిచినప్పటికీ, 2020లో జోతిరాదిత్య సింధియా 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరడంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కుప్పకూలింది. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో (2024 general elections) గెలవాలంటే ఈ ఏడాది నవంబరు-డిసెంబరులో జరిగే తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు కీలకం కానున్నాయి.

దీంతో కర్ణాటకలో పనిచేసినట్లుగానే రెట్టింపు ఉత్సాహంతో ఆయా రాష్ట్రాల్లో పనిచేయాలని కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏయే అంశాలు ప్రకటించామో అటువంటివే ప్రకటించాలని, ఉచితాలు ప్రకటించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లోక్ సభ ఎన్నికల టాస్క్ ఫోర్స్ ను నియమించిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ నేతలు పి.చిదంబరం, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ప్రియాంక గాంధీ, రణ్ దీప్ సుర్జేవాలా సహా ముకుల్ వన్సీక్, జైరాం రమేశ్ ఇందులో ఉన్నారు. వారిలో పాటు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇందులో సభ్యుడు. కర్ణాటకలోనూ కాంగ్రెస్ గెలుపులో వీరు కీలక పాత్ర పోషించారు. వచ్చే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 50 ఏళ్లలోపు వయసున్న వారికే అధిక శాతం టిక్కెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.