Vijay Mallya : మాల్యా కేసులో కీలక మలుపు..తీర్పు డేట్ కన్ఫమ్ చేసిన సుప్రీం

భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి

Vijay Mallya : మాల్యా కేసులో కీలక మలుపు..తీర్పు డేట్ కన్ఫమ్ చేసిన సుప్రీం

Malya

Vijay Mallya భారతీయ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ మాల్యా కోర్టు ధిక్కరణ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. విజయ్ మాల్యాను బ్రిటన్ నుంచి రప్పించేందుకు ఇక వేచి ఉండలేమని.. కోర్టు ధిక్కారం కేసులో మాల్యాకు విధించదగిన శిక్షను వచ్చే ఏడాది జనవరి 18న ఖరారు చేస్తామని మంగళవారం జస్టిస్ యూ.యూ.లలిత్ నేతృత్వంలో త్రిసభ్య సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

బ్రిటన్ నుంచి మాల్యాను భారత దేశానికి రప్పించే ప్రక్రియ చివరి దశలో ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొన్న ఓ నోట్ ను కోర్టుకి సొలిటర్ జనరల్ తుషార్ మొహతా సమర్పించారు. మాల్యాను భారత దేశానికి అప్పగించాలని బ్రిటన్‌లోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని, అయితే ఈ తీర్పును అమలు చేయడం లేదని విదేశీ వ్యవహారాల శాఖ కోర్టుకి తెలిపింది. కొన్ని రహస్య కార్యకలాపాలు బ్రిటన్‌లో పెండింగ్‌లో ఉన్నాయని ఆ నోట్ లో పేర్కొంది.

దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. ఏది ఏమైనప్పటికీ తాము మాల్యా కోర్టు ధిక్కారం కేసులో తదుపరి చర్యలను జనవరి 18న నిర్ణయిస్తామని తెలిపింది. న్యాయస్థానంలో స్వయంగా హాజరుకావాలా? తన న్యాయవాది ద్వారా వాదనలు వినిపించాలా? అనే అంశాన్ని నిర్ణయించుకోవలసినది మాల్యాయేనని పేర్కొంది. ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017 మే నెలలో రుజువైందని, శిక్షను విధించడం మాత్రమే పెండింగ్‌లో ఉందని పేర్కొంది.

కాగా,భారతీయ స్టేట్ బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం విజ్ఞప్తి మేరకు విజయ్ మాల్యా కోర్టు ధిక్కారానికి పాల్పడినట్లు 2017 మే నెలలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2016లో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన తర్వాత బ్రిటిష్ లిక్కర్ దిగ్గజ కంపెనీ డియాజియో స్వీకరించిన 40 మిలియన్ డాలర్లను(రూ.600కోట్లు) కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు బదిలీ చేశారని, ఇది వివిధ కోర్టు తీర్పులను ఉల్లంఘించడమేనని, ఈ కన్సార్షియం ఆరోపించింది. ఈ క్రమంలో మాల్యా తన ఆస్తుల వివరాలను కోర్టుకు సమర్పించడంలో విఫలమయ్యాడని, బ్రిటీష్ కంపెనీ నుంచి పొందిన 40 మిలియన్ డాలర్ల గురించి వెల్లడించకుండా ఉద్ధేశపూర్వకంగా అవిధేయత చూపినందుకు ధిక్కార నేరానికి పాల్పడ్డాడని మే-9,2017న సుప్రీంకోర్టు నిర్ధారించింది. ఈ మూడేళ్ల నుంచి కోర్టు మాల్యాకు శిక్ష ఖరారు విషయంలో అతని వ్యక్తిగత హాజరు కోసం ఎదురుచూసింది.

కాగా, అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ గతేడాది నవంబర్ లో మాల్యా సుప్రీంకోర్టులో పిటషన్‌ వేశాడు. కాగా పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అంతేకాకుండా కోర్టు ధిక్కారణ కేసులో కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ మాల్యా న్యాయస్థానంలో హాజరుకాలేదు.

ALSO READ Omicron Variant : ఒమిక్రాన్ ముప్పు.. తెలంగాణలో అర్థరాత్రి నుంచి ఆంక్షలు అమలు