New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రగడ.. ఎవరు ఏమంటున్నారంటే?

ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్‭కు అధిపతులు లోక్‭సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు

New Parliament Building: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రగడ.. ఎవరు ఏమంటున్నారంటే?

Boycott Inauguration Parliament Building: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభంపై పెద్ద రగడే లేచింది. వీర్ సావర్కర్ పుట్టిన రోజైన మే 28న పార్లమెంట్ ప్రారంభోత్సవం చేస్తుండడం పట్ల తొలుత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విపక్షాలు.. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. రాజ్యాంగానికి అధిపతి అయిన రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగాలని, కానీ అందుకు విరుద్ధంగా ప్రధానమంత్రి ప్రారంభించడమేంటని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే 19 విపక్ష పార్టీలు పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. అయితే వీరికి అధికారపక్షంలోని నేతలు సైతం గట్టి కౌంటరే ఇస్తున్నారు. ఇంతకీ ఎవరెవరు ఏమన్నారో చూద్దాం..

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ ‘‘నూతన పార్లమెంట్ భవనం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ప్రారంభించాలి. అత్యున్నత రాజ్యాంగ అధికారం కలిగివున్న వ్యక్తి భారత రాష్ట్రపతి. రాష్ట్రపతి మాత్రమే ప్రభుత్వం, ప్రతిపక్షం, ప్రతి పౌరునికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్రపతి చేత కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఔచిత్యానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక’’ అని ఖర్గే అన్నారు.

రాహుల్ గాంధీ సైతం ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తుండడంపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధానమంత్రి కాదని ఆయన అన్నారు. ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ స్పందిస్తూ ‘‘నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభించబడాలి. ప్రధానమంత్రి కాదు’’ అని హిందీలో ట్వీట్ చేశారు.

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం స్పందిస్తూ ‘‘ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్‭కు అధిపతులు లోక్‭సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు. పార్లమెంట్ నూతన భవనం ప్రజల సొమ్ముతో నిర్మించారు. ప్రధానమంత్రి తన స్నేహితుల డబ్బుతో నిర్మించినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు?’’ అని ట్వీట్ చేశారు.

‘‘రాజ్యాంగానికి అధిపతి రాష్ట్రపతి. పార్లమెంట్ భవనం శంఖుస్థాపనలో ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి లేకపోవడం దురదృష్టకరం. ఇది భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా అవమానించడమే. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తోంది’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చద్దా అన్నారు.

‘‘ప్రధానమంత్రి కార్యనిర్వాహఖ శాఖకు అధినేత. పార్లమెంట్ అనేది శాసనశాఖ. నూతన పార్లమెంట్ భవనాన్ని దేశానికి అధిపతి అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించడం రాజ్యాంగానికి సముచితం. కానీ తన సొంత ఇమేజ్ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాకులాడుతున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో ఇండియాలో మోదీ అలాగే వ్యవహరిస్తున్నారు’’ అని సీపీఐ చీఫ్ డీ.రాజా అన్నారు.

‘‘పార్లమెంట్ అనేది కేవలం కొత్త భవనమే కాదు. భారత ప్రజాస్వామ్యంలోని పాత విలువలు, సంప్రదాయాలు, నియమనిబంధనలకు సరికొత్త రూపం. కానీ వాటన్నిటినీ ప్రధాని మోదీ తుంగలో తొక్కుతున్నారు. నేను, నా స్వంతం అన్నట్లుగానే ఆయన తీరు ఉంది. అందుకే మనం దీన్ని ప్రశ్నించి తీరాలి’’ అని టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ అన్నారు.

‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 60, 111 అధికరణలు పార్లమెంట్‭కు అధినేత భారత రాష్ట్రపతి అని స్పష్టంగా చెబుతున్నాయి. కానీ నూతన పార్లమెంట్ భవనానికి పునాది రాయి వేసినప్పటి నుంచి ప్రారంభోత్సవం వరకు అంతటా ప్రధానమంత్రే కనిపిస్తున్నారు. రాజ్యాంగ అధిపతికి అక్కడ స్థానమే లేదు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. నూతన భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ అన్నారు.

అయితే విపక్షాల విమర్శలపై అధికార పక్షం గట్టిగానే ప్రతిదాడి చేసింది. పార్లమెంట్ భవనంపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఈ విషయమై ఆయన బుధవారం స్పందిస్తూ ‘‘పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి అన్ని పార్టీలను ఆహ్వానించాం. రావడం, రాకపోవడం అనేది వారి ఇష్టం. కానీ దీనిపై రాజకీయాలు చేయడం బాధాకరం. దీనిపై ప్రజలే ఆలోచించి సమాధానం చెప్తారు’’ అని అన్నారు.

ఇక మరో కేంద్ర మంత్రి హర్‭దీప్ సింగ్ పూరి స్పందిస్తూ ‘‘నూతన పార్లమెంట్ భవనంపై విపక్షాలు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నాయి. గతంలో పార్లమెంట్ అనుబంధ భవనాలను ప్రధానమంత్రులే ప్రారంభించారు. 1975లో పార్లమెంట్ అనుబంధ భవనాన్ని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రారంభించారు. 1987లో పార్లమెంట్ లైబ్రరీని ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ ప్రారంభించారు. మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి ప్రారంభించినప్పుడు, ఇతర పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆ పార్టీకి చెందిన ప్రధానమంత్రి ప్రారంభించకూడదు?’’ అని ప్రశ్నించారు.