భారత్‌లో కరోనాకు కళ్లెం వేయాలంటే, ఇవి రెండే మార్గాలు

  • Published By: naveen ,Published On : July 19, 2020 / 01:05 PM IST
భారత్‌లో కరోనాకు కళ్లెం వేయాలంటే, ఇవి రెండే మార్గాలు

భారత్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మన దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి(community transmission) మొదలైందని ‘ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌’ (ఐఎంఏ) తెలిసింది. ‘పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, కేసులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. సగటున రోజుకు 30వేల కొత్త కేసులు వస్తున్నాయని, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ కేసులు విస్తరిస్తున్నాయని ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ వి.కె.మొంగా తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లోకి వేగంగా చొచ్చుకుపోతున్న వైరస్‌ను నియంత్రించడం చాలా కష్టమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అప్రమత్తంగా ఉంటూ కేంద్ర సాయాన్ని తీసుకోవాలని చెప్పారు.

ఈ క్రమంలో కరోనా వైరస్‌కు కళ్లెం వేయాలంటే రెండే మార్గాలున్నాయని మొంగా చెప్పారు.
మొదటిది… మొత్తం జనాభాలో 70శాతం మందికి వైరస్‌ సోకితే సామూహిక వ్యాధి నిరోధక శక్తి వస్తుంది.
రెండోది… టీకాల ద్వారా వ్యాధి నిరోధకత సాధించడం” అని ఆయన వివరించారు.

ఒక్కరోజే 39వేల కేసులు:
దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడిచిన వారం రోజులుగా నిత్యం 30వేలకుపైగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 18,2020) ఒక్కరోజే కొత్తగా 38వేల 902 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దేశంలో ఒక్కరోజే ఈ స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్‌ బారినపడిన వారి సంఖ్య 10లక్షల 77వేల 618కు చేరింది. నిన్న ఒక్కరోజే మరో 543మంది కరోనాతో చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 26వేల 816కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్‌ సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 6లక్షల 77వేల 423 మంది కోలుకున్నారు. 3లక్షల 73వేల 379 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63శాతంగా ఉంది.

7 రోజుల్లోనే 4వేల మరణాలు:
గడిచిన వారం రోజులుగా దేశంలో కరోనా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత ఆదివారం(జూలై 12,2020) దేశంలో కరోనా మరణాల సంఖ్య 22వేల 674గా ఉండగా ప్రస్తుతం అది 26వేల 816కు చేరింది. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 500మందికి పైగా కొవిడ్‌ రోగులు మృతిచెందుతున్నారు. దీంతో ఈ వారం రోజుల్లోనే 4వేల 142 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

రోజువారీ కేసుల్లో అమెరికా తర్వాత భారత్‌:
రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిత్యం అక్కడ 70వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో ప్రస్తుతం భారత్‌ కొనసాగుతోంది. భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య 39వేలకు చేరువవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక అత్యధిక కరోనా కేసుల జాబితాలో 37లక్షలతో అమెరికా తొలిస్థానంలో ఉండగా భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. మరణాల్లో మాత్రం భారత్‌ ఎనిమిదో స్థానంలో ఉంది.