Remdesivir: సగానికి పైగా ధర తగ్గిన రెమ్‌డెసివిర్‌

Remdesivir: సగానికి పైగా ధర తగ్గిన రెమ్‌డెసివిర్‌

కొవిడ్‌ చికిత్సలో కీలకంగా మారిన రెమ్‌డెసివిర్‌ బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రెమ్‌డెసివిర్‌ డ్రగ్‌ తయారు చేస్తున్న అన్నీ ఫార్మా కంపెనీలు కూడా దీని ధరను సగానికి పైగా తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి.

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 రెండోదశ తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రుల పాలయ్యే బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో కరోనా చికిత్సలో ఉపయోగించే ఔషధాల ధరలు కూడా పెరిగిపోయాయి.

ఈ క్రమంలోనే బ్లాక్‌ మార్కెట్‌ పెరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా కొవిడ్‌-19 వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ సిఫారసు చేస్తున్నారు. ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ కొరత ఏర్పడగా, బయట మార్కెట్‌లో దీన్ని అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు.

దీంతో ధరలను తగ్గించాలని ప్రభుత్వం, నేషనల్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైసింగ్‌ అథారిటీ ఫార్మా కంపెనీలకు లేఖ రాసింది. ఈ లేఖపై సానుకూలంగా స్పందించిన ఫార్మా కంపెనీలు… ధరను సగానికిపై తగ్గించేందుకు అంగీకరించాయి.