అయోధ్యలో 6 లక్షల 6వేల 569 దీపాలు, గిన్నిస్ రికార్డు

  • Published By: madhu ,Published On : November 14, 2020 / 08:10 AM IST
అయోధ్యలో 6 లక్షల 6వేల 569 దీపాలు, గిన్నిస్ రికార్డు

Deepotsav In Ayodhya World record : దీపావళి వేళ అయోధ్య వెలిగిపోయింది. మిరుమిట్లు గొలిపే దీప కాంతులతో ప్రకాశవంతమైంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అయోధ్యలో దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో దీపాలను వెలిగించి.. ప్రపంచ రికార్డును సృష్టించారు. 6 లక్షల 6వేల 569 ప్రమిదలు వెలిగించారు. దీంతో అయోధ్య నగరం దేదీప్యమానంగా వెలిగిపోయింది. సరయూ నది తీరాన నిర్వహించిన ఈ దీపోత్సవం గిన్నిస్ రికార్డు సృష్టించింది. అయోధ్యనగరిలో దాదాపు 492 సంవత్సరాల తర్వాత దీపోత్సవం కల సాకారమైంది. ప్రమిదలను ఓ క్రమ పద్ధతిలో అమర్చి రామ్‌చరిత్ మానస్‌లోని విషయాలకు దృశ్యరూపం కల్పించారు. లలిత్ కాలా అకాడమీకి చెందిన కళాకారులు కూడా ఈ వేడుక కోసం శ్రీరాముడి రూపాలను ప్రత్యేకంగా రూపొందించారు.

దీపాలను వెలిగించిన సీఎం యోగి : –
దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన దీపోత్సవ్‌ కార్యక్రమం ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ సమక్షంలో ప్రారంభమైంది. సీఎం యోగి రామ్ లల్లా దర్శనం చేసుకొని… దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. దీపోత్సవం సందర్భంగా అయోధ్య నవవధువు వలె ముస్తాబైంది. రామ్‌కీ పైడీ ప్రాంతాల్లో రంగు రంగుల ముగ్గులు, విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. లేజర్‌ షో ఏర్పాటు చేశారు. దీపోత్సవ్‌ వేడుకలను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివచ్చారు.

రాముడి చరిత్ర : –
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వివాదాస్పద రామ జన్మభూమి అంశానికి తెరపడి..రామమందిర నిర్మాణానికి భూమిపూజ పడిన తరువాత జరుపుకుంటున్న తొలి దీపావళి ఇది. అందుకే ఈ వేడుకకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సరయూ నది తీరాన లేజర్ షో ద్వారా రాముడి చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించారు. దీపోత్సవ్‌ కార్యక్రమాన్ని సీఎం యోగి 2017లో ప్రారంభించారు. వారం రోజుల దీపోత్సవ్‌ను కరోనా కారణంగా మూడు రోజులకు కుదించారు.

గిన్నిస్ రికార్డు : –
గతేడాది సరయు నదీ తీరాన 4 లక్షల 10 వేల మట్టి దివ్వెలను వెలిగించి యూపీ ప్రభుత్వం గిన్నిస్‌ రికార్డు సొంతం చేసుకుంది. ఈసారి ఆ రికార్డును తిరగరాసేందుకు 6లక్షల 6వేల 569 ప్రమిదలను వెలిగించారు. అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైన తొలి ఏడాది కావడంతో ఈ కార్యక్రమ నిర్వహణను యోగి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్వహిస్తోంది.