e-RUPI : కొత్త పేమెంట్ వ్యవస్థ..”ఈ రూపీ”ని ప్రారంభించిన ప్రధాని మోదీ

డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ వోచర్ 'ఈ-రూపీ'ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.

e-RUPI : కొత్త పేమెంట్ వ్యవస్థ..”ఈ రూపీ”ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Modi

e-RUPI   డిజిటల్ లావాదేవీలు సులభతరం చేసేందుకు తీసుకువచ్చిన ఎలక్ట్రానిక్ వోచర్ ‘ఈ-రూపీ’ని సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..భారత్​ 75 ఏళ్ల స్వాతంత్య వేడుకలు జరుపుకోనున్న తరుణంలో ఈ విధానాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో డిజిటల్​ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల అమలులో ఈ-రూపీ ఓచర్​ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దీని వల్ల పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందన్నారు. ఎల్​పీజీ నుంచి రేషన్, పింఛన్ వరకు 300 పథకాల్లో ప్రభుత్వం ప్రత్యక్ష నగదు బదిలీ చేస్తోందని మోదీ తెలిపారు.

ఇక, ప్రభుత్వ వ్యవస్థల్లోనే కాకుండా ప్రైవేట్​ వ్యక్తులు, సంస్థలు కూడా ఈ-రూపీ విధానాన్ని వినియోగించవచ్చని మోదీ తెలిపారు. ప్రభుత్వేతర సంస్థ లేదా ప్రైవేట్ వ్యక్తులు ఎవరికైనా వారి విద్య లేదా వైద్య చికిత్సలో మద్దతు ఇవ్వాలనుకుంటే, వారు నగదు ఇవ్వడానికి బదులుగా ఐ-రూపీని ఉపయోగించాలని ప్రధాని అన్నారు. విరాళంగా ఇవ్వబడిన మొత్తం చెప్పిన పనికి మాత్రమే ఉపయోగించబడుతుందని ఇది నిర్ధారిస్తుందని వివరించారు.

ప్రారంభంలో, ఇది ఆరోగ్య లబ్ధిదారులకు వర్తిస్తుందన్నారు. ఎవరైనా 100 మంది పేదలకు టీకాలు వేయడంలో సహాయం చేయాలనుకుంటే, వారికి e-RUPI వోచర్ ఇవ్వవచ్చునని, దీంతో డబ్బు ఆ ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించబడుతుందని తెలిపారు. కాలక్రమేణా, ఈ ప్లాట్‌ఫామ్‌కు మరిన్ని సౌకర్యాలు(ఆరోగ్య సౌకర్యాలలో సహాయం చేయడం, ఆహారాన్ని దానం చేయడం వంటివి) జోడించబడతాయని తెలిపారు.

ఈ-రూపీ యొక్క పెద్ద ప్రయోజనం ఏమిటంటే, డబ్బును ఏ ప్రయోజనం కోసం పంపింస్తారో దాని కోసమే ఆ డబ్బుని ఉపయోగించవచ్చు. ప్రభుత్వం.. పుస్తకాల కోసం డబ్బు పంపినట్లయితే, ఈ-రూపి కేవలం పుస్తకాలు మాత్రమే కొనుగోలు చేయబడుతుందని నిర్ధారిస్తుంది. యూనిఫామ్ కోసం డబ్బు పంపబడితే, ఎరువుల కోసం డబ్బు పంపినట్లయితే ఆ నగదుని దాని కొనుగోలుకి మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుందని మోడీ అన్నారు.

ఇంతకుముందు మన దేశంలో కొంతమంది ధనవంతులకు మాత్రమే సాంకేతికత అందుబాటులో ఉండేదని మోదీ తెలిపారు. కానీ నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. నేడు మనం టెక్నాలజీని పేదలకు సహాయం చేయడానికి సాధనంగా, వారి పురోగతికి ఒక సాధనంగా చూస్తున్నామన్నారు. సాంకేతికత వల్ల పారదర్శకత సాధ్యమవుతోందన్నారు. అత్యాధునిక టెక్నాల‌జీ సాయంతో 21వ శ‌తాబ్ధంలో ఇండియా ముందుకు వెళ్తున్న తీరుకు ఈ-రూపీని ఉదాహ‌ర‌ణ‌గా భావించ‌వ‌చ్చు అని ప్రధాని చెప్పారు.

కాగా, నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహం, మధ్యవర్తిత్వ సాధనాల ప్రమేయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ-రూపీ (e-RUPI) అనే కొత్త పేమెంట్ వ్యవస్థను కేంద్రం రూపొందించింది. ఈ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నేషనల్ హెల్త్ అథారిటీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఈ-రూపీ అంటే.. ఒక క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ స్ట్రింగ్‌ ఓచర్‌ లను లబ్ధిదారుడి మొబైల్‌ ఫోన్‌ కి పంపిస్తారు. వీటినే ఈ-రుపీగా భావించవచ్చు. అందులో నిర్దేశిత డబ్బును ముందే లోడ్‌ చేసి పెడతారు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ ఓచర్ల వంటివే. ఈ ఓచర్‌ లేదా క్యూఆర్‌ కోడ్‌ను లబ్ధిదారుడు తనకు అవసరమైన చోట అంటే సంబంధిత సేవలు అందేచోట వినియోగించుకోవచ్చు. దీనికి బ్యాంకు, యాప్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వంటి మధ్యవర్తిత్వ వేదికలేవీ అవసరం లేదు. ప్రస్తుతం 8 బ్యాంకుల ద్వారా ఈ-రూపీ సేవలు అందించనున్నారు.