Earthquakes in Himalayas : హిమాలయాల్లో గ్రహణం రోజు ప్రకంపనలు .. ఢిల్లీకి ముప్పు తప్పదంటున్న నిపుణులు..?!

Earthquakes in Himalayas : హిమాలయాల్లో గ్రహణం రోజు ప్రకంపనలు .. ఢిల్లీకి ముప్పు తప్పదంటున్న నిపుణులు..?!

earthquakes in himalayas

Earthquakes in Himalayas : భూకంపమంటే.. ఎప్పుడు సంభవిస్తుందో తెలియని ఓ మిస్టరీ. కానీ.. అది వస్తే.. ఆ ప్రాంతం మొత్తం షేక్ అయిపోతుంది. ఒక్కసారిగా విధ్వంసం మన కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ మధ్యకాలంలో హిమాలయాలతో పాటు ఉత్తర భారతంలోనూ వరుసగా భూప్రకంపనలు వస్తున్నాయ్. దీంతో.. అక్కడి జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రకృతి ఎప్పుడు విరుచుకుపడుతుందోనని.. భయంభయంగా గడుపుతున్నారు. తాజాగా నేపాల్‌లో వచ్చిన భూకంపం.. మరింత భయాందోళనకు గురిచేస్తోంది.

నేపాల్‌లో భూకంపం, ఉత్తర భారతంలో భూప్రకంపనలు కొత్తేమీ కాదు. కానీ.. చంద్రగ్రహణం సంభవించిన కొన్ని గంటల్లోనే.. భూకంపం రావడంమీదే.. ఇప్పుడు అంతటా చర్చ మొదలైది. ఇది.. దేనికి సంకేతమనే సందేహాలు తలెత్తుతున్నాయ్. నేపాల్‌లో బుధవారం (నవంబర్) తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూప్రకంపనల ధాటికి.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. భూకంపం ధాటికి నేపాల్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయ్. ఆస్తినష్టం కూడా భారీగానే సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Earthquake-Lunar Eclipse : పౌర్ణమికి, భూకంపాలకు.. చంద్ర గ్రహాణానికి.. భూప్రకంపనలకు సంబంధముందా?

నేపాల్‌లోని దీపయాల్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైంది. దీనికంటే ముందు.. మంగళవారం కూడా రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఉత్తర భారతం పలు ప్రాంతాల్లోనూ బలమైన భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాలైన పిథోరాఘడ్, గురుగ్రామ్, లక్నో, గాజియాబాద్‌లో ఎర్త్ క్వేక్ ప్రభావం కనిపించింది. దీంతో.. ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. ప్రకంపనలు రావడంతో భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక.. ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి రోడ్లపైకి చేరుకున్నారు.

భారీ భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీతో పాటు యూపీ, బీహార్, మణిపూర్‌లోని కొన్ని చోట్ల భూప్రకంపనలు సంభవించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో 20 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 1.6గా తీవ్రత నమోదైంది. ఆఫీసుల్లో నైట్ షిప్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు కూడా ఈ అనుభవం ఎదురైంది. ఎర్త్ క్వేక్ అలారమ్ మోగడంతో.. చాలా ఆఫీసుల నుంచి ఉద్యోగులు పరుగులు పెట్టారు. మంచాలు కదిలినట్లు అనిపించడంతో.. స్థానిక ప్రజలు కూడా భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, ఆఫీసుల నుంచి బయటకు వచ్చి.. 10, 15 నిమిషాల తర్వాతే మళ్లీ లోపలికి వెళ్లారు. ఇక.. ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు సమీపంలోని హిమాలయాల్లో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంపం వల్ల భారత్‌లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగనప్పటికీ.. నేపాల్‌లో మాత్రం భారీ విధ్వంసం చోటుచేసుకుంది.

Lunar Eclipse 2022 : భారత్‌లో ముగిసిన చంద్రగ్రహణం.. కనువిందు చేసిన బ్లడ్ మూన్, మళ్లీ 2025లోనే

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్.. వివిధ ఏజెన్సీల నుంచి అందుకున్న శాస్త్రీయ సమాచారం ఆధారంగా.. భారతదేశం మొత్తాన్ని నాలుగు భూకంప మండలాలుగా విభజించింది. ఇందులో అత్యంత ప్రమాదకరమైనది జోన్ 5. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం.. ఈ ప్రాంతంలో.. రిక్టర్ స్కేలుపై 9 తీవ్రతతో.. భూకంపం సంభవించే ప్రమాదముంది. ఈ జోన్-5లో.. మొత్తం ఈశాన్య భారత రాష్ట్రాలన్నీ ఉన్నాయ్. అలాగే.. జమ్మూకశ్మీర్‌లోని కొన్ని భాగాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్, ఉత్తర బీహార్‌లోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో.. తరచుగా భూకంపాలు సంభవించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

ఇక.. జోన్-4లో.. మొత్తం జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, సిక్కిం, ఉత్తర యూపీలోని కొన్ని ప్రాంతాలు, సింధు-గంగా బేసిన్, బీహార్, వెస్ట్ బెంగాల్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, వెస్ట్ రాజస్థాన్‌లోని కొంత భాగం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలున్నాయి. జోన్-3లో.. కేరళ, గోవా, లక్షద్వీప్, యూపీ, గుజరాత్, వెస్ట్ బెంగాల్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. ఇక్కడ భూకంపాలు చాలా తక్కువగా అరుదుగా సంభవిస్తాయి. ఇక.. దేశంలోని మిగతా ప్రాంతాలన్ని.. జోన్-2 కిందకు వస్తాయి. ముఖ్యంగా.. హిమాలయాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు.. జోన్-4లో ఉన్నాయి. అందువల్ల.. అక్కడ తరచుగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు.

Lunar Eclipse 2022 : ఎరుపెక్కిన చంద్రుడు.. కనువిందు చేస్తున్న బ్లడ్‌మూన్

ఈ మధ్యకాలంలో.. హిమాలయాలతో పాటు ఉత్తర భారతంలోనూ, ముఖ్యంగా ఢిల్లీలో తరచుగా భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. ఇవేమైనా.. ప్రమాదాన్ని సూచిస్తున్నాయా? అనే సందేహం తలెత్తుతోంది. ఇందుకు.. హిమాలయాలే కారణమనే వాదన వినిపిస్తోంది. హిమాలయా ప్రాంతంలోని బెల్ట్ నుంచి ఢిల్లీకి అతిపెద్ద ముప్పు ఉందని నిపుణులు చెబుతున్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఢిల్లీలో భారీ భూకంపం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. అయితే.. ఇది ఎప్పటికీ జరగదని మాత్రం కచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతం.. ఢిల్లీకి అతి పెద్ద ముప్పు హిమాలయాల ప్రాంతంలోని బెల్ట్‌లోనే ఉందని హెచ్చరిస్తున్నారు. పెద్ద భూకంపాల శబ్దాలే.. ఈ భూప్రకంపనలని చెబుతున్నారు. తాజాగా హిమాలయాల్లో సంభవించిన ఎర్త్ క్వేక్ చూస్తుంటే.. అదే నిజమనిపిస్తోంది. నేపాల్‌కు దగ్గరలో భూకంపం సంభవిస్తే.. ఢిల్లీతో పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు రావడం.. నిపుణుల వాదనకు బలం చేకూరుస్తోంది.