24 నామినేషన్లు తిరస్కరణ : మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ రైతులకు షాక్

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 03:57 PM IST
24 నామినేషన్లు తిరస్కరణ : మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ రైతులకు షాక్

వారణాసిలో ప్రధాని మోడీపై పోటీకి దిగిన నిజామాబాద్ పసుపు రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. పరిశీలనలో 24 మంది ఆర్మూర్ రైతుల నామినేషన్లను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. ఎర్గాట్ల మండలానికి చెందిన రైతు ఇస్తారి నామినేషన్‌ ను మాత్రమే ఆమోదించారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు. దీనిపై తెలంగాణ పసుపు రైతుల సంఘం నేతలు…మే 3న ఢిల్లీకి వెళ్లి వారణాసి అధికారులపై సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. వారణాసిలో మోడీతో పాటు 119 మంది నామినేషన్లు వేశారు. వివిధ కారణాలతో 89 మంది నామినేషన్లను తిరస్కరించారు. ప్రస్తుతం వారణాసి లోక్ సభ స్థానం బరిలో ప్రధాని మోడీ సహా 30మంది మాత్రమే బరిలో ఉన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా నిజామాబాద్ పసుపు రైతులు ఓటు ఆయుధంతో పోరు ప్రారంభించారు. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి 178 మంది రైతులు బరిలోకి దిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ కూతురు కవిత సిట్టింగ్ స్థానమైన నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి మొత్తం 185 మంది బరిలో నిలవడంతో దేశం మొత్తం చర్చ జరిగింది. తర్వాత ఏకంగా వారణాసిలో ప్రధాని మోడీపై బరిలోకి దిగి సంచలనం సృష్టించారు. 50మంది పసుపు రైతులు వారణాసి వెళ్లి స్వతంత్ర అభ్యర్థులుగా ఎంపీ స్థానానికి నామినేషన్‌ వేశారు. పసుపు బోర్డుతో పాటు పంటకు మద్దతు ధర సాధించాలనే ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నామని.. ఏ అభ్యర్థికి వ్యతిరేకంగా తాము ప్రచారం నిర్వహించబోమని వెల్లడించారు. పసుపు బోర్డు సాధన కోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.