దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి

దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి

Elections across the country : దేశవ్యాప్తంగా ఎన్నికల మూడ్‌ కనిపిస్తోంది. ఓ వైపు నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ, లోకల్ ఎలక్షన్స్‌తో పొలిటికల్ హీట్ పెరిగింది. నేతల ప్రచారాలు.. విమర్శలు.. ప్రతి విమర్శలు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం రంజుగా మారింది. త్వరలో పశ్చిమబెంగాల్, అసోం, కేరళ, తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న లోకల్ ఫైట్ మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అసోం, పశ్చిమ బెంగాల్‌పై బీజేపీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.

మమతా బెనర్జీ అడ్డాలో.. కాషాయ జెండా ఎగుర వేయాలని ఆ పార్టీ అధినాయకత్వం పట్టుదలతో ఉంది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుస పర్యటనలు బెంగాల్‌లో హీట్‌పుట్టిస్తున్నాయి. అటు తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి.. బీజేపీపై విరుచుకుపడుతున్నారు. నిత్యవసరాలు మొదలు.. పెట్రోల్ ధరల పెంపు వరకు అన్నింటిపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా పెట్రో ధరల పెంపును నిరసిస్తూ.. ఎలక్ర్టిక్ స్కూటర్‌పై రాష్ట్ర సచివాలయానికి వెళ్లి నిరసన తెలిపారు. ధరాఘాతంతో నడ్డి విరుస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కేరళపైనే దృష్టిసారించినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ.. ప్రస్తుతం కేరళ టూర్‌లో ఉన్నారు. ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. రాహుల్‌ కొత్తగా మత్స్యకారుడి అవతారం ఎత్తారు. మత్స్యకారులతో కలిసి చేపలు సముద్రంలో చేపలను కూడా పట్టారు. పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఎమ్మెల్యేల రాజీనామాతో బలహీన పడ్డ నారాయణస్వామి సర్కార్.. బలపరీక్షల్లో ఓడిపోయింది. దీంతో అక్కడి నేతలు త్వరలో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచారాలు మొదలుపెట్టేశారు.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. పంచాయతీ ఎన్నికలు ముగియగానే ప్రధాన పార్టీలన్నీ మున్సిపల్ పోరుపై దృష్టి సారించాయి. పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించగా.. నారా లోకేశ్‌ కృష్ణాజిల్లాలో పర్యటించారు. కార్యకర్తలను కలిసి తామున్నామని భరోసా కల్పించారు.

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌, బీజేపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల నేతలంతా జిల్లాలను చుట్టేస్తున్నారు. విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్నారు. ఆరున్నరేళ్లలో తాము లక్షకు పైగా ఉద్యోగాలిచ్చామని అధికార టీఆర్ఎస్ చెబుతుంటే.. కాంగ్రెస్ పార్టీ నేతలు అంతా అంకెల గారడీ అంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. మొత్తానికి నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలతో నేతలంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.