ప్రతి భారతీయుడికి గర్వకారణం..టీకాల అనుమతి కొవిడ్​ పోరులో గొప్ప మలుపన్న మోడీ

ప్రతి భారతీయుడికి గర్వకారణం..టీకాల అనుమతి కొవిడ్​ పోరులో గొప్ప మలుపన్న మోడీ

Vaccines Given Approval Made In India ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనికాతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్‌కు, ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు దేశంలో అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆదివారం ఉదయం అనుమతి మంజూరు చేయడం నిర్ణయాత్మక మలుపని అభివర్ణించారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనాపై పోరులో కీలక మలుపుగా, గొప్ప ముందడుగుగా ప్రధాని అభివర్ణించారు.

కొవిడ్‌పై పోరాటాన్ని బలోపేతం చేసేందుకు ఇది నిర్ణయాత్మక మలుపు అని, ఆరోగ్యకరమైన.. కొవిడ్ రహిత దేశం దిశగా వేగవంతమైన బాటలు వేస్తుందన్నారు. డీసీజీఐ అనుమతి పొందిన రెండు వ్యాక్సిన్లు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు దేశీయంగా తయారవ్వడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని మోడీ ట్వీట్‌ చేశారు. భారత్‌ను ఆరోగ్యవంతంగా, కొవిడ్‌ రహితంగా మార్చేందుకు ఈ టీకాలు దోహదం చేస్తాయన్నారు. . ఆత్మనిర్భర్ భారత్ కలను నెరవేర్చే దిశగా శాస్త్రవేత్తల చేస్తోన్న కృషిని ఆయన కొనియాడారు. వ్యాక్సిన్ల కోసం శ్రమించిన శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన పని చేసిన వైద్యులు, వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, పోలీసు సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, కరోనా యోధులందరికీ మేం కృతజ్ఞులం అంటూ మోడీ ట్వీట్‌ చేశారు. ఎంతోమంది ప్రాణాలను కాపాడినవారికి మేం ఎప్పటికీ రుణపడి ఉంటాం అని ట్వీట్‌ లో మోడీ తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు చెప్పడంతో పాటు దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

ఇక, క‌రోనా వ్యాక్సిన్లు 110 శాతం సుర‌క్షిత‌మైనవే అని డీసీజీఐ వీజీ సోమానీ స్ప‌ష్టం చేశారు. ఈ వ్యాక్సిన్ల వ‌ల్ల స్వ‌ల్పంగా అయినా ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని అనుకుంటే తాను అనుమ‌తి ఇచ్చేవాడినే కాద‌ని ఆయ‌న అన్నారు. ఏ వ్యాక్సిన్‌తో అయినా కాస్త జ్వ‌రం, నొప్పి, అలెర్జీ వంటి స‌మ‌స్య‌లు సాధార‌ణ‌మే అని సోమానీ చెప్పారు. ఇక వ్యాక్సిన్ వ‌ల్ల నపుంస‌కులుగా మారుతార‌ని వ‌స్తున్న పుకార్లని ఆయ‌న కొట్టి పారేశారు. అందులో ఏమాత్రం వాస్త‌వం లేద‌ని తేల్చి చెప్పారు.