Narendra Tomar : రైతులు ఇళ్లకు వెళ్లిపోవాలి..MSPపై కమిటీ ఏర్పాటు
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు విరమించాలని

Narendra Tomar నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికాలంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళనలు విరమించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించాక.. ఆందోళనలు కొనసాగించేందుకు ఎలాంటి కారణం లేదని.. రైతులు తమ ఆందోళనలు ముగించి ఇళ్లకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
రైతుల డిమాండ్లను నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని తాను హామీ ఇస్తున్నానని తోమర్ చెప్పారు. పంటల వైవిధ్యం, జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర యంత్రాంగాన్ని పటిష్టం చేయడం వంటి పలు అంశాలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఈ కమిటీల్లో ఉంటారని చెప్పారు. కమిటీ ఏర్పాటుతో ఎంఎస్‌పీపై రైతుల డిమాండ్ కూడా నెరవేరినట్టేనని మంత్రి తెలిపారు.
రైతులు పంట వ్యర్ధాలను దగ్ధం చేయడాన్ని నేరపూరిత చర్యగా చూడరాదన్న రైతు సంఘాల డిమాండ్‌ను కూడా ప్రభుత్వం అంగీకరించిందన్నారు. ఇక,నవంబర్-29నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండగా,సమావేశాల తొలిరోజునే లోక్ సభలో సాగు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వ్యవసాయ మంత్రి తెలిపారు.