Farmers Protest : రైతులపై అనుచిత వ్యాఖ్యలు..బీజేపీ ఎంపీ కారు ధ్వంసం

హర్యానాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జాంగ్రాకి రైతుల సెగ తాకింది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిగా నిరసన చేస్తున్న రైతుల పట్ల

Farmers Protest  : రైతులపై అనుచిత వ్యాఖ్యలు..బీజేపీ ఎంపీ కారు ధ్వంసం

Mp

Farmers Protest   హర్యానాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రామ్ చందర్ జాంగ్రాకి రైతుల సెగ తాకింది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాదిగా నిరసన చేస్తున్న రైతుల పట్ల గురువారం రోహతక్ లో విలేఖరులతో మాట్లాడుతూ రామ్ చందర్ జాంగ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆందోళన చేస్తున్నవాళ్లలో రైతులెవ్వరూ లేరని,ఆందోళన చేస్తోంది గ్రామాల నుంచి వచ్చిన ఏ పనీ పాటా లేని తాగుబోతులని ఎంపీ విమర్శించారు.

తాను క్రమం తప్పకుండా ఢిల్లీకి వెళ్తూ ఉంటానని,సరిహద్దుల్లో రైతుల ధర్నా చేస్తున్న చోట చాలా టెంట్లు ఖాళీగా ఉన్నాయని అన్నారను. ఈ సమస్య త్వరలోనే పరిష్కారమవుతుంది అని ఎంపీ మాట్లాడిన వీడియో క్లిప్ వైరల్ గా మారింది. ఎంపీ రామ్ చందర్ జాంగ్రా చేసిన ఈ వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో శుక్రవారం హర్యానాలోని హిసార్ జిల్లాలో ధర్మశాల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ జాంగ్రాని రైతులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో నిరసన తెలిపి ఎంపీకి వ్యతిరేకంగా,హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు, రైతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా ఆందోళనకారులు ఎంపీ రామ్ చందర్ జాంగ్రా కారు అద్దాన్ని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు కొందరు రైతులను అరెస్ట్‌ చేశారు. దీనిపై రైతులు ఆందోళనకు దిగారు.

ఈ ఘటనపై ఎంపీ జాంగ్రా విలేఖరులతో మాట్లాడుతూ…”నా కార్యక్రమం ముగించుకుని, నేను మరో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా, కొందరు వ్యక్తులు నా కారుపై లాఠీలు విసిరి డ్యామేజ్ చేశారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సంఘటనకు సంబంధించి నేను హర్యానా డిజిపి మరియు ఎస్పీతో మాట్లాడాను. నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశాను. ఇది స్పష్టంగా హత్యాయత్నమే. నేను నర్వానా మరియు ఉచనలో మరో రెండు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉంది. నా కారు దెబ్బతినడంతో నేను ఆ పర్యటనలను రద్దు చేసుకోవలసి వచ్చింది. నేను ఒక సామాజిక కార్యక్రమానికి హాజరవుతున్నాను. ఇది రాజకీయ కార్యక్రమం కాదు. వారు (రైతులు) సామాజిక కార్యక్రమాలను కూడా వ్యతిరేకిస్తారా?” అని జాంగ్రా ప్రశ్నించారు. ఇక, గురువారం రోహ్‌తక్‌లోని గోవు ఆశ్రమంలో దీపావళి కార్యక్రమానికి హాజరైన ఎంపీకి ఇదే విధమైన నిరసన ఎదురైంది.

ALSO READ Pak Fuel Prices : పాక్ లో భారీగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు..చక్కెర కన్నా తక్కువే