రెండేళ్లు ఇంట్లోనే…PSA చట్టం కింద ఫరూక్ అబ్దుల్లా అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : September 16, 2019 / 10:29 AM IST
రెండేళ్లు ఇంట్లోనే…PSA చట్టం కింద ఫరూక్ అబ్దుల్లా అరెస్ట్

నేషనల్ కాన్ఫరెన్స్(NC)చీఫ్,జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా(81)ను ప్రజా భద్రత చట్టం(PSA) కింద సోమవారం(సెప్టుంబర్-16,2019) హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజా భద్రత చట్టం ప్రకారం కఠిన నిబంధనలే ఉన్నాయి. ఈ చట్టం కింద ఇల్లే .. అనుబంధ జైలుగా పరిగణిస్తారు. అతను రెండేళ్ల వరకు కోర్టు విచారణ లేకుండానే ఇంటిలో నిర్బంధించి ఉంచబడతారు. అయితే బంధువులు, స్నేహితులను కూడా కలుసుకోవడానికి అనుమతించరు. అయితే ఒక ప్రధాన స్రవంతి రాజకీయ నాయకుడిపై, ముఖ్యంగా ఒక ఎంపీ, మాజీ ముఖ్యమంత్రిపై పిఎస్ఎ చట్టం ఉపయోగించడం ఇదే మొదటిసారి. సాధారణంగా, ఇది ఉగ్రవాదులను, వేర్పాటువాదులను లేదా రాళ్లు విసిరేవారిని అరెస్టు చేయడానికి ఉపయోగించబడింది. ఇటీవల కశ్మీర్ నేత షా ఫైజల్‌పై కూడా ప్రజా భద్రత చట్టాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే.

జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370రద్దు చేసినప్పటినుంచి కశ్మీర్ లోయలో అప్రకటిత ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అక్కడి గవర్నర్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే అక్కడ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబ ముఫ్తిని గృహ నిర్బందంలో ఉంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు జమ్ముకశ్మీర్ ప్రజా భద్రత చట్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.ఫరూక్ అబ్దుల్లాపై ఈ చట్టాన్ని ప్రయోగించారు.

మరోవైపు ఎండీఎంకే నేత వైగో  ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంపై సుప్రీంకోర్టులో  పిటిషన్ వేశారు. ఫరూక్ నిర్బంధంపై వివరణ ఇవ్వాలని జమ్మూకశ్మీర్ యంత్రాంగానికి,కేంద్రప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్,జస్టిస్ ఎస్ఏ బోబ్డే,ఎస్ఏ నజీర్ నేతృత్వంలోని ధర్మాససం ఈ పిటిషన్ పై ఈ నెల 30 తదుపరి విచారణ ఉంటుందని తెలిపింది. 

అయితే ఫరూక్ పై పీఎస్ఏ చట్టం ప్రయోగించిన సమయంపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో..ఫరూక్ అబ్దుల్లా మీడియా ముందుకొచ్చి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసే అవకాశముందని,  ఈ నెల చివరిలో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి ముందే ఈ సమావేశానికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారే అవకాశముందని,అందుకే ఆయనపై ఈ చట్టాన్ని ప్రయోగించినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.