Cyclone Tauktae: కరోనాకు తోడుగా తౌక్తా తుఫాను.. ఏ రాష్ట్రాల్లో ప్రభావం ఉంటుందంటే?

Cyclone Tauktae: కరోనాకు తోడుగా తౌక్తా తుఫాను.. ఏ రాష్ట్రాల్లో ప్రభావం ఉంటుందంటే?

First Cyclone Of 2021 Likely To Form Over Arabian Sea On May 16

Cyclone Tauktae: కరోనాతో దేశం అల్లాడిపోతుంటే.. దానికి తోడుగా తుఫాన్ రాబోతుంది. అరేబియా సముద్రంలో భీకర తుపాను ఏర్పడబోతున్నట్లుగా భారత వాతావరణ విభాగం(IMD) హెచ్చరించింది. దేశంలోని పశ్చిమతీరం నుంచి తుఫాను ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడుతోందని, ఇది అరేబియా సముద్రం ప్రక్కనే ఉన్న లక్షద్వీప్ వైపు కదులుతుందని భావిస్తున్నారు. మే 16వ తేదీ నాటికి తుఫాను క్రమంగా తీవ్రమవుతుందని చెబుతున్నారు.

తుఫాను ఎప్పుడు, ఎక్కడ?
ఈ సంవత్సరంలో వస్తోన్న మొట్టమొదటి తుఫాను ఇది కాగా.. ఆదివారం(16 మే 2021) నాటికి దేశంలోని పశ్చిమ తీరాన్ని తుఫాను తాకుతుందని వాతావరణ శాఖ చెబుతుంది. లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌లపై దీని ప్రభావం ఉండవచ్చు అని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. ఈ తుఫాను ప్రభావంతో కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో మే 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయి.

నివేదిక ప్రకారం, తుఫాను మే 20న కచ్ ప్రాంతానికి దక్షిణాన వెళ్లి దక్షిణ పాకిస్తాన్ వైపు కూడా వెళ్ళవచ్చు. ఇది జరిగితే, మే 17 లేదా 18 నాటికి గుజరాత్ తీర ప్రాంతాలకు చేరుకుంటుంది. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో, దాని వైఖరి గురించి మరింత సమాచారం లభిస్తుంది. వచ్చే వారం నాటికి ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
లక్షద్వీప్, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశించారు. తీరప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కూడా ఉండగా.. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

60 కిలోమీటర్ల వేగంతో గాలి..
మాల్దీవుల్లోని లక్షద్వీప్ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర తీరప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడవచ్చు.

మే 16 నాటికి..
తౌక్తా తుఫాను తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మే 16 వరకు శక్తివంతవగా ఉంటుంది అని, వాయువ్య దిశగా కదులుతుందని చెబుతున్నారు. ఈ తుఫాన్‌కు మాయన్మార్ తౌక్తా అనే పేరు పెట్టింది. తౌక్తా అంటే పెద్ద శబ్దం చేసే బల్లి.